29 June, 2026 | 3:08 AM

బంగాల్ స్ఫూర్తితో పోరాడాలి

29-06-2026 02:00 AM
  1. తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా కదలాలి
  2. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరడం ఖాయం
  3. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌నబీన్
  4. శంషాబాద్‌లో వర్చువల్‌గా 9 జిల్లాల బీజేపీ కార్యాలయాల ప్రారంభం
  5. పార్టీ కార్యాలయం ఒక పవిత్ర దేవాలయం
  6. రాష్ట్ర చీఫ్ ఎన్ రాంచందర్‌రావు

రంగారెడ్డి/శంషాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): పశ్చిమ బంగాల్ స్ఫూర్తితో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోరాడాలని, అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులన్నీ ఏకతాటిపై కదిలి ఓట్లను కూడగట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ఈసారి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు వచ్చితీరుతుందని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తూ, ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించుకోవాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఆదివారం జరిగిన ఒక ప్రత్యే క కార్యక్రమంలో నితిన్ నబీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి రూరల్ జిల్లా నూతన బీజేపీ కార్యాలయంతోపాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్ సహా మొత్తం 9 జిల్లాల నూతన పార్టీ కార్యాలయాలను ఆయన వర్చువల్‌గా ప్రారంభిం చారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

బంగాల్ తరహా పోరాటం చేయాలి

కేవలం ప్రజాసేవ, నిరంతర క్షేత్రస్థాయి పోరాటాల ద్వారానే రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోగలమని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. పశ్చిమ బంగాల్‌లో తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు, అధికార పార్టీ దాడులు ఎదురైనా కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో పోరాడి బీజేపీని బలోపేతం చేశారని, అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ ఉద్యమించాలన్నారు.

త్వరలోనే ఈ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉండే ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ వస్తేనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ‘సర్దార్ పటేల్ చొరవతో ఊపిరి పీల్చుకొని నిజాం నిరంకుశ కబంధ హస్తాల నుంచి వి మోచనం పొందిన తెలంగాణ గడ్డపై డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం తథ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలుకు సాధ్యం కాని హామీలతో ఇక్కడ అధికారంలోకి వచ్చిందని నితిన్ నబీన్ పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ లక్ష్యంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. లోక్‌సభలో కేవ లం రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం.. నేడు దేశవ్యాప్తంగా అప్రతిహతంగా సాగుతోందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ మద్ద తు ఇవ్వడం వల్లే, సుష్మాస్వరాజ్ వంటి నేతల పోరాటం వల్లే తెలంగాణ కల సాకారమైందన్నారు.

పార్టీ కార్యాలయం ఒక పవిత్ర దేవాలయం: రాంచందర్‌రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు మాట్లాడుతూ, పార్టీ కార్యాలయం అనేది కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన కట్టడం కాదని, అదొక పవిత్రమైన దేవాలయం లాంటిదని అభివర్ణించారు. ఈ కార్యాలయ వేదికల నుంచే పార్టీ సిద్ధాంతాలను, కేంద్ర ప్రభుత్వ ప్రజాసంక్షేమ పథకా లను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడమే ఏకైక లక్ష్యంగా పనిచేయాలన్నారు.

కార్యక్రమంలో చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఆర్ కృష్ణయ్య, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్ భూపాల్‌గౌడ్, రాష్ట్ర నాయకులు సుధాకర్‌రెడ్డి, పేరాల శేఖర్‌జీ, మాజీ ఎమ్మెల్యే కేస్ రత్నం, అందేలా శ్రీరాములుయాదవ్, తోకల శ్రీనివాస్‌రెడ్డి, అందే బాబయ్య, నోముల దయానంద్‌తో పాటు బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, అంజన్ కుమార్‌గౌడ్, పోరెడ్డి నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకులు జంగయ్యా యాదవ్, బుక్క వేణుగోపాల్, చేవెళ్ల మహేందర్, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శులు దేవేందర్‌రెడ్డి, నారాయణ యాదవ్, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.