29 June, 2026 | 2:46 AM

ఆశించిన మార్పు రాలే

29-06-2026 01:41 AM
  1. స్వరాష్ట్రం వచ్చి 12 ఏళ్లయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు 
  2. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని ఏటీఎంలా మార్చుకున్నది 
  3. కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలిచ్చింది.. 
  4. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేసింది 
  5. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ప్రగతి.. బీజేపీ గెలుపునకు కృషిచేయాలి 
  6. పార్టీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు పిలుపు 
  7. మూడు పార్టీలు కలిసినా మాదే గెలుపు: పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 
  8. ఎంఐఎం నుంచి హైదరాబాద్‌ను రక్షించాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): స్వరాష్ట్రం వచ్చి 12 ఏళ్లు దాటిన ప్పటికీ ప్రజలు ఆస్వాదించిన మార్పు రాలేదని, బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆకాంక్షించారు. డబుల్ ఇంజిన్ సర్కారుతోనే ప్రగతి కొత్తపుంతలు తొక్కుతుందని తెలిపారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజ య్, పార్టీ ఇన్‌చార్జులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆదివారం ఆయన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించిన పార్టీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో మాట్లాడారు.

రాష్ట్రాన్ని అవినీతి, కుటుంబ పార్టీలు పట్టిపీడిస్తున్నాయని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఎంఐఎంని ఉద్దే శించి పరోక్షంగా విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి, ఎన్ని హామీలైనా ఇస్తుందని, కానీ.. వాటి అమలు విష యంలో మాత్రం పట్టింపు ఉండదని ఎద్దే వా చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ యువతకు యేటా 2 లక్షల ఉద్యోగాలిస్తామని, అధికారం చేతబట్టి, ఆ తర్వాత యువతకు మొండిచేయి చూపించిందని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని మూడు కార్పొరేషన్ల లోనూ బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నిక ల్లోనూ తమదే అధికారమని జోస్యం చెప్పారు. అయితే.. అధికార పగ్గాలు చేతబట్టాలంటే, కార్యకర్తల కృషి ఎంతో అవసర మని నొక్కిచెప్పారు. పార్టీ బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు వెళ్లి ప్రతి ఓటర్లను కలిసి, పార్టీ విధానాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని పిలుపునిచ్చా రు.

రానున్న రోజుల్లో కార్యకర్తలు మరింత అంకితభావంతో పనిచేసి భాగ్యనగరంలో విజయబావుటా ఎగురవేయాలని ఉద్బోధ చేశారు. తెలంగాణ ప్రజలపై బీజేపీకి నమ్మ కం ఉందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. దేశ సమైక్యతకు పునా ది వేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికతనే, ప్రధాని నరేంద్ర మోదీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ రూపంలో ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.

దశాబ్దాల క్రితమే డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆ ఆలోచనను సాకారం చేసే దిశగా మనకు మార్గ దర్శనం చేశారని కొనియాడారు. తాను పార్టీ జాతీయ అధ్యక్షుడినైనా, తన అసలు బలం కార్యకర్తలేని వివరించారు. పార్టీ నిజమైన శక్తి కార్యకర్తలేనని, పార్టీకి ఉత్సాహం, బలం అందించేది కార్యకర్తలేనని కితాబునిచ్చారు. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సుపరిపాలన, సేవతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని, అధికారం అనేది ప్రజలపై పాలన చేయడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి ఒక సాధనం మాత్రమే అని మోదీ చూపించారని కొనియాడారు.

తెలంగాణ ప్రజల మద్దతుతో బీజేపీ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని నితిన్ నబీన్ తెలిపారు. తెలంగాణను అవినీతి, కుటుంబ రాజకీయాల బంధనాల నుంచి విముక్తి చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీపై ఉందని నొక్కి చెప్పారు. ప్రతి బూత్ పరిధిలో బీజేపీ వికసించేలా పనిచేద్దామని, తెలంగాణలో బీజేపీ విజయాన్ని సాధిద్దామని పిలపునిచ్చారు. కొందరు బీజేపీ రాష్ట్రానికి కొత్త పార్టీ అని కొందరు అంటున్నారని, కానీ వారికి చరిత్ర పూర్తిగా తెలియదని విమర్శించారు.

1984 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే గెలి చారని, ఆ ఇద్దరిలో ఒకరు తెలంగాణ ప్రాం తం నుంచే ఎన్నికయ్యారని గుర్తుచేశారు. అప్పటి నుంచే తెలంగాణ ప్రజలు తమ పార్టీపై విశ్వాసం ఉంచారన్నారు. తెలంగాణతో తమ అనుబంధం కేవలం రాజకీయ బంధం కాదు..అది పోరాటం, విశ్వాసం, గౌరవంతో ముడిపడి ఉందన్నారు.

2014 లో ప్రధాని మో దీ నాయకత్వంలో దేశం అరాచక పాలన నుంచి బయటపడిందని, ఇప్పుడు అదే మార్పు తెలంగాణలో కూడా రావాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సంఖ్యాపరంగా తాము వెనుకబడి కనిపించవచ్చని, కానీ బీజేపీ కార్యకర్తల కష్టం, శ్రమ, త్యాగంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. 

హామీలను మరచిన కాంగ్రెస్..

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు చేసిన త్యాగాలు ఎంతో గొప్పవని, ఆ పోరాటంలో బీజేపీ కార్యకర్తల పాత్ర కూడా ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల కలలను పూర్తిగా సాకారం చేయగలిగేది మోదీ నాయకత్వంలోని బీజేపీ మాత్రమే అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అవినీతిని మొదటి నుంచి చివరి వరకు ఎదిరించి పోరాడింది బీజేపీయేనన్నారు. ‘ప్రజ లు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు... కానీ కాంగ్రెస్ తన పాత రాజకీయ సంస్కృతినే కొనసాగిస్తున్నది’ అని విమర్శించారు.

కాంగ్రెస్ కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే హామీలు ఇస్తుంది.. అమలు కోసం కాదు’ని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీని మరింత బలమైన శక్తిగా నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే గెలుపు సంకల్పంతో ముందుకు సాగాలని, ప్రతి బూత్ అధ్యక్షుడు, ప్రతి కార్యకర్త మూడు ముఖ్యమైన సంకల్పాలు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌ను ప్రజలు తిరస్కరించిన తర్వాత కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు.. కానీ కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు.

జాబ్ క్యాలెండర్, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్... తెలంగాణ యువతను మోసం చేస్తోందని విమర్శించారు. బీజేపీ యువ కార్యకర్తలు కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు బలంగా వివరించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తు తో పోటీ చేసే ప్రతి అభ్యర్థిని గెలిపించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అవినీతిలో మునిగిపోయాయని, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి ప్రతీకగా మారిందని ఉద్ఘాటించారు.

గత బీఆర్‌ఎస్ సర్కారు పేద ప్రజల కష్టార్జిత ధనాన్ని దోచుకునేందుకు కాళేశ్వరాన్ని ఏటీఎంలా వాడు కుందని దుయ్య బట్టారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే వరకు, అవినీతికి పాల్పడిన దోషులను శిక్షిం చే వరకు బీజేపీ పోరాటం ఆపదన్నారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పీవీ నరసింహారావు నాడు సంకల్పిస్తే దాన్ని  మోదీ ఆ కలను సాకారం చేశారని అన్నారు.

కావాలనే జీహెచ్‌ఎంసీ ముక్కలు: రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్

సీఎం రేవంత్ రెడ్డి కావాలనే జీహెచ్‌ఎంసీని మూడు ముక్కలు చేసిందని, ఎందుకంటే 48 డివిజన్లలో బీజేపీ గెలిస్తే..కాంగ్రెస్ రెండు స్థానాల్లో కూడా గెలవలేదని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ‘కాంగ్రెస్ ఈజ్ ముస్లిం.. ముస్లిం ఈజ్ కాంగ్రెస్’ అని సీఎం రేవంత్‌రెడ్డి అంటూంటే కాంగ్రెస్ నేతలకు చీమూనెత్తురు లేదా.. అని ప్రశ్నించారు. ఈసారి మూడు కార్పొరేషన్లలో బీజేపీని గెలిపించాలన్నారు.

ఎంఐఎంను ఎదుర్కొనే దమ్ము తమ పార్టీ బూత్ అధ్యక్షులకే ఉందని ధీమా వ్యక్తం చేశారు. పరిపాలన మొత్తం దారుసలాం (ఎంఐఎం) నుంచే జరుగుతుందని దుయ్యబట్టారు. బెంగాల్ గెలుపు తర్వాత కేంద్రం తెలంగాణపై దృష్టి సారించిందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషనలలో 4 శాతం ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఉద్ఘాటించారు. 

మూడు పార్టీలు కలిసొచ్చినా గెలిచేది బీజేపీయే:రాంచందర్‌రావు

గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేసినా, గెలుపు తమదేనని, హైదరాబాద్ బీజేపీ అడ్డా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మూడు కార్పొరేషన్లలోనూ కమలం వికసించడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపే చూస్తున్నారని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశీయులు, రోహింగ్యాలతో ఎంఐఎం హైదరాబాద్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోందని విమర్శించారు.

జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాలను సీఎం రేవంత్‌రెడ్డి రియల్‌ఎస్టేట్ అడ్డాలుగా మార్చేశారని ఆరోపిం చారు. గత బీఆర్‌ఎస్ పాలనలో ఒక రోజు వాన పడితేనే హైదరాబాద్ సగం మునిగిపోయేదని, ఇప్పుడు కాంగ్రెస్‌పాలనలో చిన్నవాన పడినా రోడ్లు జలమయం అవుతున్నా యన్నారు. కరెంట్ షాక్లతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. బంగాల్ మాదిరే రేపు హైదరాబాద్‌లో, తెలంగాణలో ప్రజల మద్దతుతో బీజేపీ గెలుపు ఖాయమన్నారు.

ఎంఐఎం నుంచి హైదరాబాద్‌ను రక్షించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఎంఐఎం కంబంధ హస్తాల నుంచి హైదరాబాద్‌ను రక్షించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి.. మేం తెలంగాణకు ఏం ఇచ్చామో...ఏం తెచ్చామో అడగడం కాదు.. ప్రజలకు నువ్వేం ఇచ్చావో..ఏం చేశావో’ చెప్పాలని ప్రశ్నించారు. తాము ఏం ఇచ్చామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని, గ్యారెంటీల పేరుతో ప్రజలకు హామీ ఇచ్చిన ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఎటుపోయిందని నిలదీశారు.

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణ దోచుకున్నాయని, కాంగ్రెస్ పార్టీ వాటాలు వసూలు చేస్తుంటే, బీఆర్‌ఎస్ కమిషన్‌లు వసూలు చేసిందని ఆరోపించారు. హైదరాబాద్‌ను ఎంఐఎం చేతుల్లో పెడతాంటే ఊరుకోమని, మూడుకు మూడు అన్ని గ్రేటర్ కార్పొరేషన్లలో బీజేపీనే గెలవాలని కార్యకర్తలకు సూచించారు. బస్తీల్లో బీజేపీ బాట చేపట్టాలని, కాంగ్రెస్‌కు ఒక మేయర్, మజ్లీస్‌కు ఒక మేయర్ అనే రాజకీయలను హైదరాబాద్ ప్రజలు అంగీకరించరని, అందుకే ‘సేవ్ తెలంగాణ...సపోర్ట్ బీజేపీ’ నినాదంతో మనం ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. 

ఐదింటిలో నాలుగు ఎంపీ సీట్లు బీజేపీకే : ఎంపీ ఈటల రాజేందర్

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఐదు ఎంపీ సీట్లుంటే నాలుగు ఎంపీ సీట్లు బీజేపీనే గెలిచిందని, రానున్న రోజుల్లో మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ జెండా ఎగురవేయాలని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. బీఎల్వోగా పనిచేసేది తమ ప్రభుత్వ అధికారులే కదా..మరి ఎలా బీజేపీ ఓట్లు తొలగిస్తుందో సమాధానం చెప్పాలని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.

‘బీఆర్‌ఎస్‌ను చూశాం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశాం..ఇక తమ ఓటు బీజేపీకే అని ప్రజలు అంటున్నారు’ అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ ప్రజలు బంగాల్ తీర్పునే ఇవ్వబోతున్నారని జోస్యంచ చెప్పారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను సీఎం రేవంత్ కూలగొడుతున్నారని, వాటి పర్యావసానంగానే కాంగ్రెస్ ఓటమి అంచునకు వెళ్లిందని దుయ్యబట్టారు.