29 June, 2026 | 3:05 AM

సీఎం రేవంత్‌కు పాతకేసుల భయం

29-06-2026 01:56 AM
  1. అందుకే మోదీకి దామగుండం భూముల అప్పగింత
  2. కాంగ్రెస్, బీజేపీ కలిసే వికారాబాద్ అడవులకు ఉరి
  3. ఈ దుర్యోధనుడి పనులు.. ధృతరాష్ట్రుడిలా స్పీకర్‌కు కనిపిస్తలేవా?
  4. కేసీఆర్ పాలనపై సీఎం, స్పీకర్ దుష్ప్రచారం
  5. వికారాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వికారాబాద్, జూన్ -28( విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డిని పాతకేసుల భయం వెంటాడుతోందని, అందుకే ప్రధాని మోదీకి దామగుండం భూములను అప్పగించారని బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నాడు నేవీ రాడార్ ఏర్పాటుకు కేసీఆర్ ససేమిరా అన్నారని, కానీ కాంగ్రెస్, బీజేపీ కలిసే వికారాబాద్ అడవులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉరేశాయని విమర్శించారు. మూసీ పుట్టిన చోటు ను మరిచి.. మూసీ ప్రక్షాళనా? అని, ఇది ముమ్మాటికీ కమీషన్ల కోసమేనని చెప్పారు.

రేవంత్‌రెడ్డి దుర్యోధనుడిలాంటి ఈ పనులు.. ధృతరాష్ట్రుడి లాంటి స్పీకర్ ప్రసాద్‌కుమార్ కు కనిపిస్తలేవా? అని ప్రశ్నించారు. అబద్ధాల పునాదుల మీద నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే ఖతమవుతుంద న్నారు. రేవంత్ బ్రదర్స్ దోపిడీతో రియల్ ఎస్టేట్ కుదేలైందని తెలిపారు. కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్ తదితరులు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నా రు. 100 రోజుల్లో 100 హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిం దని, ప్రజలు గమనించాలని కోరారు. 

రాష్ట్రంలో అమలవుతున్న ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో యుద్ధానికి సిద్ధం కావాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలని నినాదంతోనే ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఆదివారం వికారాబాద్ నియోజకవర్గస్థాయి సభ్యత్వ నమోదు, సర్‌పై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన కేటీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గౌలికర్ ఫంక్షన్ హాల్లో మెతుకు ఆనంద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. పదేళ్లలో కేసీఆర్ రెండు లక్షలా 80 వేల కోట్ల అప్పే చేశారని కేటీఆర్ తెలిపారు. కానీ సీఎం, స్పీకర్ లాంటి వాళ్లు కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేసినట్లు తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారని చెప్పారు.

కేసీఆర్ అప్పు చేసిన మాట వాస్తవమేనని, ఆ మొత్తాన్ని రైతులకు, పేదల సంక్షేమానికే ఖర్చు చేశారని వివరించారు. సమయానికి మంచినీళ్లు ఇచ్చామని, 200 పెన్షన్‌ను రెండువేలకు పెంచామన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేశామని, సమయానికి రైతుల ఖాతాలో రైతుబంధు వేశామని పేర్కొన్నారు. 7 లక్షల మంది పిల్లలకు ఉచిత చదువులు చదివించామని, 14 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి ఇచ్చామని వివరించారు.

వికారాబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి, జిల్లా కలెక్టర్ కార్యాలయం కట్టించామన్నారు. వికారాబాద్ జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేశామని కేటీఆర్ తెలిపారు. రూ.73 వేలకోట్లను 76 లక్షలమంది రైతుల ఖాతాల్లో జమ చేసిన మొనగాడు కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. 

100 హామీల అమలు ఏమైంది?

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 100 హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి 30 నెలలు గడుస్తున్నా ఎందుకు హామీలు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభ పెట్టిన ప్రసాద్‌కుమార్ హామీల హమలుపై ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. దుర్యోధనుడి లాంటి రేవంత్‌రెడ్డి చేసే పనులు ధృతరాష్ట్రుడి లాంటి ప్రసాద్‌కుమార్‌కు కనిపించడం లేదని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతకాక అప్పుల పాలయ్యామని చేతులెత్తేశాడనే, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

రేవంత్ బ్రదర్స్ దోపిడీతో రియల్ ఎస్టేట్ మాయం

రేవంత్‌రెడ్డి బ్రదర్స్ గుప్పిట్లో భూమి మొత్తం ఉండడంతో రియల్ ఎస్టేట్ పూర్తిగా స్తంభించిపోయిందని కేటీఆర్ ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే కేసులు వేసి అడ్డుపడినట్లు ఆయన తెలిపారు. అయినప్పటికీ 90 శాతం పనులు పూర్తి చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేదని స్పష్టం చేశారు. పాలమూరు పనులు జరగకపోతున్నా, వికారాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ గుంతలుగా మారినా స్పీకర్‌కు ఎందుకు కనిపించడం లేదని కేటీఆర్ నిలదీశారు. 

ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండాలి

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందనే మొద్దు నిద్రలో ఉంటే నష్టం జరుగుతుందని కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. యుద్ధానికి చాలా సమయం ఉన్నా ఇప్పుడే క్షేత్రస్థాయిలో బూతుస్థాయిలో సభ్యత్వం చేయడంతోపాటు చురుకుగా పనిచేయాలన్నారు. సర్‌పై ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండి, ఓట్లు పోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, శుభప్రద్ పటేల్  తదితరులు పాల్గొన్నారు.

మూసీ పుట్టిన చోటును మరిచి.. మూసీ ప్రక్షాళనా?

 సీఎం రేవంత్‌రెడ్డి కేవలం కమీషన్ల కోసమే మూసీ ప్రక్షాళన చేపట్టారని కేటీఆర్ ఆరోపించారు. మూసీ నది పుట్టిన కాడ మూసీని చంపేసి.. మూసీ నది ప్రక్షాళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దామగుండం అడవిలో నేవీ రాడర్ ఏర్పాటుకు 2,900 ఎకరాలను అప్పగించాలని కేసీఆర్‌పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తే.. కేసీఆర్ ససేమీర అన్నారని కేటీఆర్ తెలిపారు.

దామగుండం అడవిని నేవీ రాడర్‌కు అప్పగిస్తే 12 లక్షల చెట్లను నరికివేస్తారనే ఉద్దేశంతో కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి మోదీ అంటే భయమని, పాత కేసులను తీసి జైల్లో వేయిస్తారనే భయంతోనే అడగ్గానే దామగుండం భూమిని అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసే వికారాబాద్ అడవులకు ఉరివేశాయని ఆరోపించారు.