నిబంధనలకు నీళ్లు!
- మద్యం దుకాణాల్లో మైనర్లకు విక్రయాలు
- బెల్ట్ షాపులకు మద్యం సరఫరా
- బార్లను తలపిస్తున్న పర్మిట్ రూములు
- అసలైన యజమానులను పక్కనపెట్టి చక్రం తిప్పుతున్న బినామీలు
- ఎక్సయిజ్ అధికారులకు నెలవారీ మామూళ్లు..
మేడ్చల్, జూన్ 28 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మద్యం దుకాణాల యజమానులు నిబంధనలకు విరు ద్ధంగా విక్రయాలు జరుపుతున్నారు. లైసెన్స్ పొందినప్పటి నుంచి విక్రయాల వరకు ప్రతి అంశంలో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మైనర్లకు మద్యం విక్రయించడం, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేయడం, పర్మిట్ రూంలో ఆహార పదార్థాల తయారీ వంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. అం తేగాక అనేక దుకాణాలు బినామీల చేతుల్లో ఉన్నాయి.
మేడ్చల్ జిల్లా రెండు ఎక్సైజ్ సూపరిండెంట్ పరిధిలో ఉంది. ఈ రెండింటిలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతి నెల ఎక్సైజ్ అధికారులకు మామూళ్ళు ముట్టడం వల్ల దుకాణదారులు ఎన్ని అక్రమాలకు పాల్పడిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. కిందిస్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు మామూళ్ళు అందుతున్నట్లు తెలుస్తోంది. మీరు ఏ మైనా చేసుకోండి, మాకు మా మూళ్ళు ఇస్తే చాలు అనే ధోరణి లో ఎక్సైజ్ అధికారులు ఉన్నారు.
ఎన్నో అక్రమాలు బయటపడినప్పటికీ ఇప్పటివరకు ఎక్సైజ్ అధికారులు ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోలేదు. కొన్నిచోట్ల నివాసాల మధ్య మద్యం దుకాణాలు వద్దని స్థానికులు ఆందోళన చేయగా ఎక్సైజ్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోలేదు.
స్థానికులు వద్దన్న చోట దుకాణాలు ఏర్పాటయ్యాయి. మైనర్లకు మద్యం విక్రయించవద్దనే నిబంధనలు ఉన్నాయి. ఇటీవల మేడ్చల్ పట్టణంలో ఒక వైన్స్‌లో మద్యం విక్రయించగా వాటిని మైన ర్లు ద్విచక్ర వాహనం మీద రవాణా చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొ ట్టాయి. కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఆ మద్యం బెల్టుషాపునకు తరలించడం గమనార్హం. బెల్ట్ షాపు నిర్వహించడం కూడా అక్రమమే. ఎక్సైజ్ అధికారులు ఇంతవరకు బెల్టు షాపు మీద దాడి చేయలేదు.
బార్లను తలపిస్తున్న పర్మిట్ రూములు..
పర్మిట్ రూములను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. పర్మిట్ రూములో ఆహార పదార్థాలు తయారు చేయరాదు. కానీ పర్మిట్ రూములు బార్ లను తలపిస్తున్నాయి. ఆహార పదార్థాలను అక్కడే తయారు చేస్తున్నారు. మద్యం దుకాణం యజమానులు పర్మిట్ రూములను, స్టఫ్ దుకాణాలను అద్దెకు ఇస్తున్నారు.
దీంతో వారు ఎక్కువ ధరకు విక్రయించి మందు బాబులను దోచుకుంటున్నారు. బయట నుంచి కనీసం వాటర్ బాటిల్ ని కూడా లోపలికి అనుమతించడం లేదు. కొన్ని దుకాణాల వద్ద ఏకంగా బయట ఆహార పదార్థాలకు అనుమతి లేదని బోర్డులు పెట్టినప్పటికీ మామూళ్ల మత్తులో ఎక్సైజ్ అధికారులకు కనిపించడం లేదు.
బినామీ గుప్పిట్లో మద్యం దుకాణాలు..
కొన్ని మద్యం దుకాణాలు బినామీల గుప్పిట్లో ఉన్నాయి. లైసెన్స్ పొందిన వారి పేర్లు కేవలం దరఖాస్తులకే పరిమితం చేసి బినామీలే చక్రం తిప్పుతున్నారు. ఆదాయ పన్ను శాఖ, బినామీ నిషేధ యూనిట్ అధికారులు మే నెలలో మేడ్చల్ జిల్లాలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేయగా బినామీల చేతుల్లో దుకాణాలు ఉన్నట్లు తేలింది. గత ప్రభుత్వం మద్యం దుకాణాలకు రిజర్వేషన్ కల్పించింది. 15% గౌడ, 10 శాతం ఎస్సీ, ఐదు శాతం ఎస్టీలకు మద్యం దుకాణాలను కేటాయించింది.
మల్కాజిగిరి పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన మద్యం దుకాణాల్లో 10 దుకాణాలు పొందిన వారు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేయలేదని అధికారులు గుర్తించారు. మేడ్చల్ పరిధిలో 15 దుకాణాల్లో 14 దుకాణాలు పొందిన వారు ఐటీ రిటర్న్ దాఖలు చేయలేదు. బినామీల చేతుల్లో ఉన్నాయని ఎక్సైజ్ అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా మద్యం దుకాణాల యజమానులు నిబంధనలు పాటించేలా ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.






