ఎత్తిపోతలకు ఎసరు
రాష్ట్రప్రభుత్వం స్పందించకపోతే సంక్షోభంలోకి సాగు
వేల కోట్లలో లిఫ్ట్ ఇరిగేషన్ విద్యుత్ బిల్లులు
మొత్తం బకాయిలు చెల్లించాలని పట్టుబడుతున్న ట్రాన్స్‌కో
నిరంతర విద్యుత్ సరఫరాకు.. నో!
ఆన్-ఆఫ్ విధానంలో సరఫరాకు ఓకే
ఈ విధానంలో పంప్‌లు రిపేర్‌కు వస్తున్నాయని ఇరిగేషన్‌శాఖ గగ్గోలు
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): తెలంగాణ వ్యవసాయరంగానికి ఆయువుపట్టున ఎత్తిపోతల పథకాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రాజెక్ట్‌లకు 24/7 విద్యుత్ సరఫరా అందాల్సి ఉండగా, వేల కోట్ల విద్యుత్ బకాయిల కారణంగా ట్రాన్స్ కో సరఫరాకు ససేమీరా అంటున్నది. దీంతో నదుల్లో సమృద్ధిగా జలాలు ఉన్నప్పటికీ, వాటిని ఎత్తిపోసేందుకు విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం పడుతున్నది.
ఎత్తి పోతల పథకాలకు 24 గంటల నిరంతరాయ విద్యుత్ అవసరమని ఇరిగేషన్ శాఖ కోరుతుండగా, రోజులో 12 గంటలు.. అది కూడా పగలు మాత్రమే సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో స్పష్టం చేస్తున్నది. కరెంటు బిల్లులు చెల్లించే వరకూ నిరంతర విద్యుత్ సరఫరాకు ససేమిరా అంటున్నది. ఈ రెండు శాఖల మధ్య సమన్వయ లోపం వానాకాలం సాగు అశనిపాతంలా మారే ప్రమాదం కనిపిస్తున్నది.
ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు ఆలస్యమై, తక్కువ వర్షపాతం నమోదైన వేళ.. ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ల పరిధిలో విద్యుత్ సరఫరా సమస్య రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నది. ఇప్పటికే ప్రాజెక్ట్‌ల వద్ద ఆన్ అండ్- ఆఫ్ విద్యుత్ సరఫరా చేయడం కారణంగా భారీ పం పులు దెబ్బతింటున్నాయని ఇంజినీర్లు వా పోతున్నారు. పరిస్థితిని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికప్పుడు సమీక్షించకపోతే, వ్యవసాయరం గం కుదేలయ్యే ప్రమాదం కనిపిస్తున్నది.
సంక్షోభమెందుకంటే?
తెలంగాణలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణ యేటా ముందస్తు ప్రణాళిక ప్రకారమే సాగుతుంది. వానాకాలం, యాసంగిలో ఎంత నీటిని ఎత్తిపోయాలి? ఏ పంపింగ్ స్టేషన్ ఎన్ని రోజులు, ఎన్ని గంటలు పనిచేయాలి? దానికి ఎంత విద్యుత్ అవసరం? అనే అంశాలపై ఇరిగేషన్ శాఖ ఏప్రిల్, -మే నెలల్లోనే సమగ్ర అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి, ట్రాన్స్‌కోలోని ఎస్‌ఎల్డీసీ (స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్)కు అందజేస్తుంది. ఆ ప్రణాళిక ఆధారంగానే విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపింగ్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు.
అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఇరిగేషన్ శాఖ ట్రాన్స్‌కోకు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులు, నిర్వహణ వ్యయా లు, ఇతర బకాయిలు భారీగా పేరుకుపోవడంతో రెండు శాఖల మధ్య విభేదాలు తలె త్తాయి. బకాయిలు చెల్లించకపోతే 24 గంట ల నిరంతరాయ విద్యుత్ సరఫరా సాధ్యం కాదని ట్రాన్స్‌కో స్పష్టం చేయగా, ఎత్తిపోతల పథకాలకు పూర్తి స్థాయి విద్యుత్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఇరిగేషన్ శాఖ వాదిస్తోంది.
ఈ ప్రతిష్ఠంభనతో ఈ సీజన్‌కు అవ సరమైన విద్యుత్ ప్రణాళిక ఇప్పటికీ ఖరారు కాలేదని సమాచారం. విద్యుత్ అవసరాల అంచనాలు సిద్ధం కాకపోవడం, బిల్లుల చె ల్లింపుపై స్పష్టత లేకపోవడం, శాఖల మధ్య సమన్వయం లోపించడంతో ఎత్తిపోతల పథకాల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. దీంతో వానాకాలంలో సాగునీటి సరఫరా ఎలా ఉంటుందన్నది ఇప్పుడు పెద్ద సమస్య.
బిల్లుల భారమే ప్రధాన అడ్డంకి..
ఎత్తిపోతల పథకాల నిర్వహణలో ప్రస్తు తం విద్యుత్ బిల్లుల బకాయిలే అతిపెద్ద సమస్యగా మారింది. రాష్ట్రంలోని ప్రధాన పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసినందుకు ట్రాన్స్‌కోకు ఇరిగేషన్ శాఖ చెల్లించా ల్సిన బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరాయి. ఈ బకాయిలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ట్రాన్స్ కో తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బిల్లులు చెల్లిస్తేనే పూర్తి స్థాయి విద్యుత్ సరఫరా చేస్తామని ట్రాన్స్‌కో స్పష్టం చేసినట్లు సమాచారం. అధికారిక లెక్కల ప్రకారం, విద్యుత్ బిల్లుల రూ పంలోనే దాదాపు రూ.27,027 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఎత్తిపోతల పనులకు సం బంధించిన బిల్లులు రూ.863.51 కోట్లు, నిర్మాణ దశలో ఉన్న పంప్ హౌస్‌లు, విద్యు త్ మౌలిక సదుపాయాలకు రూ.3,900.81 కోట్లు, నిర్వహణ ఖర్చులకు రూ.1,745 కో ట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం కలిపి ట్రాన్స్‌కోకు ఇరిగేషన్ శాఖ చెల్లించాల్సిన బకాయి లు రూ.38,536.32 కోట్లకు చేరినట్లు తెలుస్తోంది.
దీంతో గత సీజన్ నుంచే 24 గంటల బదులు 12 గంటల పగటి విద్యుత్ సరఫరా కొనసాగుతున్నది. ఈ పరిమిత సరఫరా కా రణంగా ఎత్తిపోతల పథకాలు నిర్దేశించిన ల క్ష్యానికి అనుగుణంగా నీటిని ఎత్తిపోసే పరిస్థితి లేకపోవడంతో, రిజర్వాయర్లు, బ్యాలె న్సింగ్ ట్యాంకులు, చివరి ఆయకట్టుకు నీటి సరఫరాపై ప్రభావం పడుతోంది. బిల్లుల చెల్లింపులో జాప్యం కొనసాగితే రానున్న ఖరీ ఫ్ సీజన్‌లో ఈ సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇరిగేషన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఆన్ -ఆఫ్ విధానంతో ఇబ్బందులే..
ఎత్తిపోతల పథకాలలో అత్యంత భారీ సామర్థ్యం కలిగిన పంపులు, మోటార్లు ఉపయోగిస్తారు. ఒకసారి పంపింగ్ ప్రారంభిం చిన తర్వాత నిరంతరాయంగా పనిచేస్తేనే అవి సమర్థంగా నీటిని ఎత్తిపోస్తాయి. మధ్య లో తరచూ విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మళ్లీ ప్రారంభించే ఆన్-ఆఫ్ విధానం వల్ల సాంకేతికంగా తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఇరిగేషన్ ఇంజినీర్లు వా పోతున్నారు. పంపింగ్ నిలిపివేసిన ప్రతిసారీ ప్రెషర్ మెయిన్లు, టేక్-ఆఫ్ కాలువల్లో నీటి ఒత్తిడి ఒక్కసారిగా మారిపోతుంది.
మళ్లీ మో టార్లను ప్రారంభించినప్పుడు భారీ విద్యుత్ లోడ్‌తో పాటు తీవ్ర ప్రకంపనలు (వైబ్రేషన్లు) ఏర్పడతాయి. ఈ ప్రకంపనల ప్రభా వం వల్ల పంపుల ఇంపెల్లర్లు, బేరింగ్స్, మో టార్ల అంతర్గత భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఒకసారి ఈ పరికరాలు దెబ్బతింటే వాటి మరమ్మతులకు కోట్ల రూపాయల వ్యయమవుతుంది. అంతేకాకుండా, పథకం నిర్వహణ కూడా రోజుల తరబడి నిలిచిపో యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 28 పం పింగ్ స్టేషన్లు ఈ ఆన్-ఆఫ్ విధానంలోనే పనిచేస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే మేడారం, రామడుగు పంపింగ్ స్టేషన్లలో ప్రకంపనల కారణంగా కొన్ని పంపుల ఇంపెల్లర్లు దెబ్బతిన్న ఘటనలు నమోదయ్యాయని అధికా రులు చెబుతున్నారు. రాష్ట్రంలోని దాదాపు 35 ప్రధాన పంపింగ్ స్టేషన్లలో ఈ విధానం సాంకేతికంగా సాధ్యం కాదని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. అధిక డిశ్చార్జ్ సామ ర్థ్యం, 10 మెగావాట్లకు పైగా రేటింగ్ కలిగిన మోటార్లు, పొడవైన ప్రెషర్ మెయిన్లు, లైనిం గ్ లేని టేక్-ఆఫ్ కాలువలు ఉన్న ఎత్తిపోతల పథకాలలో విద్యుత్‌ను పదేపదే నిలిపివేయ డం వల్ల పంపింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది.
చివరి ఆయకట్టుకు నీరు చేరడంలో ఆలస్యం జరుగుతుంది. దీంతో జలాశయాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండక, సాగునీటి పంపిణీ కూడా దెబ్బతింటుంది. అందుకే ఆన్--ఆఫ్ విధానం విద్యుత్ పొదు పు చర్యగా కనిపించినప్పటికీ, దీర్ఘకాలంలో భారీ యంత్రాల పనితీరు, ఎత్తిపోతల సామ ర్థ్యం, సాగునీటి భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఇరిగేషన్ ఇంజినీర్లు హెచ్చరిస్తున్నారు.
ఎల్‌నినో ప్రభావం..
రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందకపోతే, ఆ ప్రభావం నేరుగా సాగునీటి సరఫరాపైనే పడుతుంది. జలాల పంపింగ్‌కు అవసరమై న మేర విద్యుత్ సరాఫరా లేకపోతే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, చెరువులు పూర్తిస్థాయి లో నిండవు. దీంతో చివరి ఆయకట్టు వరకు నీరు చేరడంలో జాప్యం జరుగుతుంది. పం ట చేతికొచ్చే సమయంలో రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది.
ముఖ్యంగా కాళేశ్వరం, కల్వకుర్తి, నెట్టెంపాడు, దేవాదుల వంటి భారీ ఎత్తిపోతల పథకాలపై ఆధారపడిన ప్రాంతాల్లో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షాలు తగ్గి నా, పంపింగ్ సామర్థ్యం తగ్గినా పంటలకు అవసరమైన సమయంలో నీరు అందక దిగుబడులపై ప్రభావం పడే ప్రమాదం ఉం దని ఇరిగేషన్ అధికారులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. ఇప్పటికే గత సీజన్లో కొన్ని ప్రాంతాల్లో ఇదే కారణంతో చివరి ఆయకట్టుకు నీరు ఆలస్యంగా చేరిన పరిస్థితులు ఎ దురయ్యాయని అధికారులు గుర్తుచేస్తున్నారు.
దీనికి తోడు ఈ ఏడాది ఎల్‌నినో ప్రభా వం ఉండొచ్చన్న హెచ్చరికలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చే అవకాశముంది. సాధారణం కంటే, తక్కువ వర్షపాతం నమోదైతే, సహజంగా జలాశయాల్లోకి వచ్చే నీటి ప్రవాహం తగ్గుతుంది. అలాంటి పరిస్థితుల్లో సాగు, తాగు నీటి అవసరాలను తీర్చేందుకు ఎత్తిపోతల పథకాలపై మరింతగా ఆధారపడాల్సి వస్తుంది.
అందుకే ముందస్తుగా విద్యు త్ ప్రణాళిక సిద్ధం చేసి, ఎత్తిపోతల పథకాలకు నిరంతరా య విద్యుత్ అందించడం అత్యంత కీలకమని నిపుణులు సూచి స్తున్నా రు. ప్రభుత్వం తక్షణం ట్రాన్స్‌కోకు బకాయిలను చెల్లించి పంపింగ్ స్టేషన్లకు నిరంతరాయ విద్యుత్ సరఫరా కల్పించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.






