రైల్వేట్రాక్ పైకి నో ఎంట్రీ!
ట్రాక్ వెంట ఫెన్సింగ్ రక్షణ
మహబూబాబాద్, జూలై 3 (విజయక్రాంతి): కాజీపేట, విజయవాడ రైల్వే మార్గంలో రైళ్ల వేగం పెంపు, మూడవ రైల్వే ట్రాక్ ఏర్పాటు నేపథ్యంలో రైలు ప్రమాదాలను నివారించడానికి, దక్షిణ మధ్య రైల్వే శాఖ పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టింది. కాజీపేట నుండి విజయవాడ రైలు మార్గంలో ఇంజనీరింగ్ అధికారులు రైల్వే ట్రాక్ కు ఇరువైపులా రైల్వే స్టేషన్లు ఉన్నచోట సిమెంట్ గోడలు, ఇతర ప్రదేశాల్లో ప్రత్యేకంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తున్నారు. గతంలో కొంతమేర రైల్వే ట్రాక్ వెంట భూముల పరిరక్షణ కోసం ప్రహరీ గోడలు నిర్మించారు.
తాజాగా పూర్తిగా రైల్వే ట్రాక్ వెంట ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టడం విశేషం. ఈ మార్గంలో వందే భారత్ సహా అనేక సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. పలుసార్లు రైల్వే ట్రాక్ దాటేందుకు పశువులు, ప్రజలు ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోవడంతో పాటు రైళ్లకు ప్రమాదం ఏర్పడే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే ట్రాక్ వెంట ప్రత్యేకమైన జింక్ ఫెన్సింగ్ ఏర్పాటు పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. పూర్తిగా రైల్వే స్థలం నిర్ధారణ చేసి, అక్కడనుండి ఫెన్సింగ్ పనులు చేపట్టారు.
రైల్వే ట్రాక్ నేరుగా ఎక్కడ కూడా దాటడానికి వీలు లేకుండా, పటిష్టమైన ఫెన్సింగ్ నిర్మాణం జరుపుతున్నారు. దీనితో రైల్వే ట్రాక్ దాటడం కొంత కష్టమే. పశువులు, అడ్డదారిలో వాహనాలను రైల్వే ట్రాక్ దా టించడం ఇప్పుడు అంత సులువుగా జరిగే పని కాదు. కాజీపేట విజయవాడ సెక్షన్ లో ఉత్తరాది, దక్షిణాది మార్గాల నుంచి నిత్యం అనేక రైళ్లు నడుస్తున్నాయి. దీనికి తోడు సరుకు రవాణా రైళ్ల సంఖ్య కూడా ఇటీవల మరింత పెరిగింది.
దీనితో రైల్వే ట్రాక్ వెంట ఎక్కడ కూడా అంతరాయం కలుగకుండా ఫెన్సింగ్ పనులు చేపట్టినట్లు రైల్వే ఇంజనీరింగ్ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రైల్వే ట్రాక్ దాటడానికి ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలను లేదంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లెవెల్ క్రాసింగ్ లను మాత్రమే వినియోగించాలని, ఎక్కడపడితే అక్కడ రైల్వే ట్రాక్ దాటే ప్రయత్నాలు చేస్తే రైల్వే శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరిస్తున్నారు.
కాజీపేట డోర్నకల్ సెక్షన్లో మహబూబాబాద్ స్టేషన్ వరకు మూడవ రైల్వే లైన్ అందుబాటులోకి రావడంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకల సమయం మరింత తగ్గింది. దీనికి తోడు రైళ్ల వేగాన్ని కూడా పెంచడంతో ఇకనుండి రైల్వే ట్రాక్ నేరుగా దాటేందుకు ప్రయత్నిస్తే ఎప్పుడు ఏ క్షణంలో ఎటువైపు నుంచి రైలు వస్తుందో తెలియని పరిస్థితి ఉంటుందని, నేరుగా రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నిస్తే ప్రమాదాలను కొని తెచ్చుకోవడమేనని రైల్వే అధికారులు చెబుతున్నారు.






