6 July, 2026 | 3:19 AM

దేవుడి సొత్తుతో గర్ల్‌ఫ్రెండ్‌తో జల్సాలు

06-07-2026 02:14 AM

2 లక్షల నగదు, ఫోన్ గిఫ్ట్ నిందితుడి బ్యాంకు ఖాతాపై ఆరా

అయోధ్య రామాలయ నిందితుడి విచారణలో వెలుగులోకి మరిన్ని విషయాలు

నేడు ఆలయ ట్రస్ట్ భేటీ, రాజీనామాలపై నిర్ణయం

లక్నో, జూలై 5: అయోధ్య రామాలయ విరాళాల చోరీ చేసిన నిందితులు ఆస్తులు కూడబెట్టుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో 8 మంది అరెస్టయ్యారు. తాజాగా ఓ నిందితుడి విషయాలు వెలుగులోకొచ్చాయి. చోరీ చేసిన దేవుడి సొత్తుతో గర్ల్‌ఫ్రెండ్‌తో జల్సాలు చేశాడు. ఆమెకు రూ. 2 లక్షల నగదు, ఖరీదైన మొబైల్ ఫోన్ కొనిపెట్టాడు. ప్రధాన నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లాను విచారించిన సిట్ అధికారులకు రోజుకో కొత్తకోణం వెలుగుచూడడంతో నివ్వెరపోతున్నారు.

మరిన్ని వివరాలను రాబట్టేందుకు నిందితులను విచారించేందుకు సిట్ అధికారులు ఆదివారం జైలుకు వెళ్లారు. నిందితులు విరాళాలను, డబ్బును సాక్సుల్లో, జేబుల్లో వేసుకున్నట్లు సీసీ టీవీ ఫుటేజీల ద్వారా సిట్ అధికారులు గుర్తించారు. దీనిపై కూపీ లాగగా అవినాష్ శుక్లా గర్ల్‌ఫ్రెండ్‌తో జల్సాల విషయం బయటికి వచ్చింది.

అతని సోదరుడు అభిషేక్ ద్వారా మరిన్ని వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర టస్ట్ సోమవారం ఆలయ ప్రధాన అధికారులు, అర్చకులతో భేటీ కానున్నట్లు ప్రకటించింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలు సమర్పించిన రాజీనామాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు నృత్యగోపాల్ దాస్ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్నాడు.

దీంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే సమావేశంలో పాల్గొంటారని సభ్యుడు పరాశరన్ తెలిపారు. ఇంకోవైపు రామ మందిర విరాళాల చోరీపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేయాలని వీహెచ్‌పీ పోలీసులను డిమాండ్ చేస్తూ లేఖ రాసింది. నిందితులను పట్టించే ఏ విషయాన్ని కూడా వదలకూడదని లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.