గన్నీ సంచుల కొరకై రైతుల ఖాతాల్లో నేరుగా చెల్లింపులు
68 వేల టన్నుల మొక్కజొన్న కొనుగోలు పూర్తి
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించిన మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ గన్నీ సంచుల కొరత ఉన్నప్పటికీ నిరంతరాయంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో 15 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ఇప్పటివరకు సుమారు 68 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
ఇప్పటికే 18 లక్షల గన్నీ సంచులు వినియోగించగా, మిగిలిన ధాన్యం కొనుగోళ్ల కోసం మరో 30 లక్షల గన్నీ సంచులు అవసరమవుతున్నాయని తెలిపారు. మార్కెట్‌లో సరఫరా లోపం కారణంగా ఈ కొరత ఏర్పడినట్లు పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లలో ఆలస్యం లేకుండా ఉండేందుకు, రైతులు తమ వద్ద ఉన్న గన్నీ సంచులను స్వయంగా తీసుకురావాలని సూచించారు. వాటిని నాణ్యత ప్రమాణాల మేరకు పరిశీలించి స్వీకరించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం గన్నీ సంచులకు చెల్లింపులు చేసి, ఆ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. గన్నీ సంచుల వినియోగం, నిల్వలపై పారదర్శకత కోసం ప్రతి కేంద్రంలో ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలని, ధరలను స్పష్టంగా ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న కొనుగోళ్లు ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయడం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.






