9 May, 2026 | 2:41 AM

మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ముగింపు సభను జయప్రదం చేయాలి

09-05-2026 01:29 AM

వరికుప్పల వెంకన్న

సూర్యాపేట, మే 8 (విజయక్రాంతి): ఈనెల 12న వరంగల్ జిల్లా నర్సంపేటలో జరుగుతున్న వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు మాజీ శాసనసభ్యులు యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవ ముగింపు సభను జయప్రదం చేయాలని యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, జిల్లా కార్యదర్శి షేక్ నజీర్‌లు అన్నారు.

ముగింపు సభకు సంబంధించిన వాల్ పోస్టర్ ను శుక్రవారం జిల్లా కేంద్రంలోని భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహం వద్ద ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మే 12, 2025 నుండి 2026 మే 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా కామ్రేడ్ ఓంకార్ అనుసరించిన అంశాలను నెలకు ఒక అంశాన్ని ప్రజలలో ముందు ఉంచుతూ సంవత్సర కాలం పాటు శతజయంతి వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయుధం చేత పట్టి ఆనాటి నిజాం రజాకార్లకు, దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడు కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ గారు అని అన్నారు. దేశంలో కుల, మత, ప్రాంతీయ  దోపిడీ, ఆర్థిక అసమానతలు లేని సమాజం రావాలని తప్పించి నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు కమ్యూనిస్టు నాయకునిగా ప్రజలకు సేవలు అందించారన్నారు.  ఈ కార్యక్రమంలో  యంసిపిఐ(యు) పట్టణ నాయకులు శబరి, వివేక్, వెంకటేశ్వర్లు, వెంకన్న, నరసయ్య, పద్మ, విమల, జ్యోతి, పుష్ప తదితరులు పాల్గొన్నారు.