15 July, 2026 | 1:34 AM

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు సింగరేణికి పట్టిన శని

15-07-2026 01:34 AM
  1. రెండు ప్రభుత్వాలు సంస్థను అప్పుల ఊబిలోకి నెట్టేశాయి 
  2. కేసీఆర్ నిర్ణయాలతో సింగరేణి 15 ఏళ్లు వెనక్కి.. 
  3. కార్మికుల ఆదాయ పన్ను భారాన్ని తగ్గిస్తాం 
  4. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
  5. ముగిసిన రెండు రోజుల సింగరేణి భరోసా యాత్ర 
  6.   54 వేల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలి 
  7. కార్మికులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ 

* కార్మికుల కష్టంతో సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తుంటే శవాల పక్కన నక్కల్లగా కూర్చున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు నేడు సింగరేణి దివాలా తీసేలా చేశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతుగా వాడుకొని దోపిడీ చేశాయన్నారు.

సింగరేణి భరోసా యాత్రలో భాగంగా రెండవ రోజు మంగళవారం భూపాలపల్లి జిల్లా గణపురం, మంచిర్యాల జిల్లా ఎస్‌ఆర్పీ--3 గని, పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని గోదావరిఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మాట్లాడారు. సంస్థను పదేళ్లపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం జేబు సంస్థగా మార్చు కుందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో దోపిడీ చేస్తున్నదని ఆరోపించారు.

కేసీఆర్ అరచేతిలో స్వర్గం చూపిస్తే, సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్‌బాల్ ఆడేందుకు సంస్థ నిధులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీపడి లక్షల కోట్ల రూపాయలను దండుకొని నేడు సంస్థలో కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణం కోసం సంస్థకు చెందిన రూ. 500 కోట్ల నిధులను మళ్లించారని ఆరోపించారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రధాని మోదీ ఎంతో ఆలోచిస్తున్నారని, కార్మికులకు ఐటీ భారం తగ్గించే చర్యలు తీసుకుంటామని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

భూపాలపల్లి/మంచిర్యాల/రామగుండం/పెద్దపల్లి, జూలై 14 (విజయక్రాంతి): సిరులు కురిపించే సింగరేణి సంస్థకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు శనిలా పట్టి పీడించాయని, కార్మికుల కష్టంతో లాభాల్లో నడుస్తున్న సంస్థను ఆ రెండు పార్టీలు దివాలా తీయించాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని బంగారు బాతుగా వాడుకొని దోపిడీ చేశాయన్నారు.

సింగరేణి సంస్థను పదేళ్లపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వం జేబు సంస్థగా మార్చుకుందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో దోపిడీకి పాల్పడుతున్నదని మండిపడ్డారు. కార్మిక సంఘాలన్నీ జెం డాలు, ఎజెండాలు పక్కనపెట్టి సింగరేణి సంస్థ రక్షణ కోసం కలిసికట్టుగా పనిచేయాలని కిషన్‌రెడ్డి సూచించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మంగళవారం రెండవ రోజు భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని బసవరాజు పల్లి సమీపంలో ఉన్న కేటీకే 8 గని వద్ద సింగరేణి కార్మికులతో సమావేశం నిర్వహించారు.

మొదట ఆయన గని ప్రాంగణంలో జెండా ఆవిష్కరించి కార్మికులతో కలిసి ర్యాలీగా సమావేశ స్థలానికి వెళ్లారు. మంచిర్యాల జిల్లాలో ఎస్‌ఆర్‌పీ 3 గనిపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని గోదావరిఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును సందర్శించి, కార్మి కులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బసవరాజు పల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు.

సింగరేణి సంస్థ నిధులను రెండు ప్రభుత్వాలు కొల్లగొట్టాయని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా పాఠశాలల నిర్మాణానికి సింగరేణికి చెందిన రూ.500 కోట్ల నిధులను మళ్లించారని ఆరోపించారు. సింగరేణి కార్మికులు రా త్రింబవళ్లు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి సంస్థను లాభాల్లోకి తెస్తే రెండు పార్టీలు నేడు సింగరేణి దివాలా తీసేలా చేశారని ఆరోపించారు.

సింగరేణి ఆధారంగా చేసుకుని కేసీఆర్ ప్రభుత్వం 8,958 కోట్లు జెన్‌కోకు అప్పుగా ఇ చ్చిందని, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి 26,875 కోట్లు అప్పు చేశారని, 54 వేల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలన్నారు. అప్పుల కోసం కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం బెదిరించే విధంగా మాట్లాడుతుందని కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎక్కడా లేని సమస్యలు సింగరేణిలో నెలకొన్నాయని, కార్మికులంతా సంఘ టితంగా సింగరేణి పరిరక్షణ కోసం కృషి చేయాలని, సింగరేణి సంస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ప్రాణా లు అరచేతిలో పెట్టుకొని కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నప్పటికీ తమ కు టుంబ భవిష్యత్తు కోసం పనిచేస్తున్న కార్మికుల జీవితాలతో ప్రభుత్వాలు చెలగాటమాడా యని తీవ్రంగా విమర్శించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచిస్తున్నారని, కార్మికుల ఆదాయ పన్ను భారాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. బొగ్గు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందని, బొగ్గు లేకపోతే దేశం ఒక్కరోజు కూడా ముందుకు సాగే పరిస్థితి లేదన్నారు.

తాడిచర్ల. బొగ్గు బ్లాక్‌లో సుమా రు 434 మిలియన్ టన్నుల గ్రేడ్ 8 నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, దీనివల్ల సింగరేణికి 1.20 లక్షల కోట్ల టర్నోవర్ వచ్చే అవకాశం ఉందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ కా ర్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రా మచంద్రరావు, ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పాలనలో దోపిడీ హోల్‌సేల్

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వనరుల దోపిడీ హోల్‌సేల్ స్థాయిలో జరుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిటైల్ దోపిడీ చేస్తుంటే, మంత్రులు హోల్‌సేల్ దుకాణాలు తెరిచారని, సీఎం రేవంత్‌రెడ్డి అయితే అతిపెద్ద హోల్‌సేల్ దుకాణం నిర్వహిస్తున్నట్లు తీవ్ర విమర్శలు చేశారు.

పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌లోని గోదావరిఖని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు వద్ద ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో కొత్త కోల్ బ్లాక్‌లు రాలేదని, పదేళ్లలో సింగరేణి తీవ్రంగా నష్టపోయిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి సింగరేణిపై నిజమైన ప్రేమ ఉంటే సంస్థకు రావాల్సిన రూ.58 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వెంకటేశ్ నేత, బీఎంఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య, కందుల సంధ్యారాణి, బలుమూరి వనిత, మెరుగు హనుమంత్ గౌడ్, సారంగపాణి, రావుల రాజేందర్, పిడుగు కృష్ణ, చందుపట్ల సునీల్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

సింగరేణిలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీపడి లక్షల కోట్ల రూపాయలను దండుకొని నేడు సింగరేణిలో కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి తీసుకువచ్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా ఎస్సార్పీ 3 గనిపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ లక్షల కోట్లు ఖర్చు పెడితే రేవంత్‌రెడ్డి వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి రావలసిన బకాయిలు రూ. 60 వేల కోట్లు 12 ఏండ్లుగా ఇవ్వకపోవడంతో సింగరేణి ఉద్యోగులకు నేడు జీతాలు ఇవ్వడానికి బ్యాంకుల చుట్టూ ప్రదర్శనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సింగరేణిలో మౌలిక వసతులు కరువయ్యాయని, ప్రస్తుతం మనం అగ్ని గుండం మీద కూర్చున్నామని, అది ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితిలో కంపెనీ ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. గనుల్లో కనీసం టాయిలెట్ బాగు చేసేందుకు డబ్బులు లేని పరిస్థితి ఉన్నదని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో సింగరేణి ఉద్యోగులకు 250 గజాల స్థలం, రూ. 20 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి విస్మరించిందన్నారు. 2018లో కేసీఆర్ ఆరు కొత్త బొగ్గు గనుల శంకుస్థాపన చేసి ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒకటి కూడా అమలు కాలేదన్నారు. కొత్త క్వార్టర్స్, మౌలిక వసతులు సింగరేణి ప్రాంతంలో పూర్తిగా కరువయ్యాయని పేర్కొన్నారు.

కాంగ్రెస్ హయాంలోనే 2 లక్షల 60 వేల కోట్ల కుంభకోణం అయినప్పుడు బొగ్గు బ్లాకులు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసి భవిష్యత్తులో వేలం ద్వారానే బొగ్గు బ్లాకులు కేటాయించాలని నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ ప్లోర్ లీడర్ మహేశ్వర్‌రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్, ఎంపీ ఈటల, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

కిషన్‌రెడ్డి పర్యటనతో కార్యకర్తల్లో జోష్ 

  • సింగరేణి భరోసా యాత్రతో ప్రజల్లోకి బీజేపీ 

సింగరేణి భరోసా యాత్ర పేరుతో భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి నిర్వహించిన రెండు రోజుల పర్యటన బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపింది. మూడు జిల్లాల్లో నిర్వహించిన కార్యక్రమాలకు సింగరేణి కార్మికులతో పాటు పార్టీ కార్యకర్తలు, రోజువారి కూలీలు, కొంతమంది అభిమానులు హాజరయ్యారు. వారి ద్వారా కేంద్ర ప్రభుత్వ చర్యలు ప్రజల్లోకి వెళ్తుందని నేతలు భావిస్తున్నారు.

కమ్యూనిస్టు పార్టీ ప్రాబల్యం కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కమలం పాగా వేసేందుకు సింగరేణి భరోసా యాత్ర దోహద పడింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో భరోసా యాత్ర సాగింది. ఇప్పటివరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నామమాత్రంగా బీజేపీ మనుగడ సాగిస్తోంది. కాంగ్రెస్ కంచుకోటగా, కమ్యూనిస్టు భావాలు కలిగిన జిల్లాగా పేరు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కమలం పార్టీ బలం పుంజుకునేందుకు పావులు కదుపుతోంది.

ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా అడ్డుపడుతుందని దుమ్మెత్తి పోస్తున్న తరుణంలో సింగరేణి సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నేతలు ప్రచారం చేశారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు సింగరేణిని ఓటు బ్యాంకు గానే ఉపయోగించుకున్నారు తప్పా కార్మికుల సంక్షేమానికి, సింగరేణి సంస్థ అభివృద్ధికి ఏ మాత్రం కృషి చేయలేదని ధ్వజమెత్తారు.

నష్టాల బారిన పడుతున్న సింగరేణి సంస్థను రక్షించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను భరోసా యాత్ర ద్వారా ప్రజల్లో ప్రచారం చేసి, సింగరేణి కార్మికులకు మనోధైర్యాన్ని నింపేందుకు ఈ యాత్ర ఎంతగానో ఉపయోగపడింది.

గ్రేడ్ 8 రకం బొగ్గు గలిగిన తాటిచెర్ల 2 బొగ్గు బ్లాకులను ఎలాంటి వేలంపాట లేకుండా నామినేషన్ పద్ధతిపై సింగరేణి సంస్థకు అప్పగించి సింగరేణి మనుగడను కాపాడిందని కేంద్రమంత్రి నొక్కి వక్కాణించారు. సింగరేణి కార్మికులకు ఇవ్వాల్సిన సందేశాన్ని వారు పనిచేస్తున్న ప్రాంతానికే వెళ్లి, వివరించడం మరింత ఉత్సాహాన్ని నింపిందని చెప్పవచ్చు.