పచ్చిమేతకు కొరత!
- వర్షాభావంతో బీళ్లుగా భూములు
- పచ్చిగడ్డి పోచ కూడా మొలవని దుస్థితి
- ఎండు గ్రాసానికీ కటకట
- సాకలేక అమ్ముకుంటున్న రైతులు
- పాడి గేదె రూ.40 వేల నుంచి రూ.60 వేలే..
పచ్చిమేత కొరత తెలంగాణ రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక భూములు బీడుగా మారగా, పశువులకు మేత దొరకడం కష్టమైంది. దీంతో వేలాది మంది రైతులు లక్ష రూపాయల విలువైన పాడి పశువులను రూ.40 వేల నుంచి రూ.60 వేలకే విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి) : పశుపోషణపైనా ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. సరైన వర్షాలు కురవక భూములు బీడుగా మారాయి. పచ్చిగడ్డి పోచ కూడా మొలవని దుస్థితి పల్లెల్లో నెలకొంది. యాసంగి సీజన్‌లో లభించిన వరి గడ్డినే పశువులకు అందిస్తున్నారు. అయితే ఎండుగడ్డి ధరలు కూడా ఆకాశాన్నంటడంతో రైతులకు పశుపోషణ భారంగా మారింది. సాధారణంగా వర్షాలు సమృద్ధిగా కురిస్తే పచ్చిమేత విస్తారంగా లభించేది.
కానీ, ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఒకవైపు ఎండు గడ్డి కొరత.. మరోవైపు పచ్చిమేత అందుబాటులో లేకపోవడంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పచ్చి మేత కొరత ప్రభావం పాల ఉత్పత్తిపైనా పడుతుందని చెబుతున్నారు. తప్పని పరిస్థితుల్లో పశువులను అమ్ముకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్కువ ధరకు కొనుగోలు
అన్నదాత పశువులు ఆస్తిగానే కాదు.. కుటుంబ సభ్యులతో సమానంగా భావిస్తారు. అలాంటి పశువులను వర్షాభావ పరిస్థితుల కారణంగా అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే తమ నిస్సహాయతను ఆసరాగా చేసుకుంటున్న దళారులు సంతలో పశువులను తక్కువ ధరకు అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. గతంలో రూ.లక్ష వరకు ధర పలికిన మేలు రకం ఆవులు, పాడి గేదెలను ప్రస్తుతం రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు మాత్రమే అడుగుతున్నారని చెబుతున్నారు.
మేత ఖర్చులు భరించలేక కాడెద్దులు, పాడి పశువులను సైతం అమ్ముకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఈ వానాకాలం ఇంతటి కడుపుకోత మిగులుస్తుందని అనుకోలేదని పాడి రైతులు వాపోతున్నారు. రానున్న రోజుల్లోనూ వర్షాలు అనుకూలించకపోతే రాష్ర్టంలోని పశుసంపదపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదు.
రాయితీపై మేత అందించాలని విజ్ఞప్తి
ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పశుగ్రాస డిపోలను ఏర్పాటు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాయితీపై ఎండు, పచ్చి మేత అందించడంతో పాటు నష్టాల్లో ఉన్న పాడి రైతులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, సబ్సిడీలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిస్తేనే తెలంగాణ పల్లెల్లో మళ్లీ పచ్చదనం పరుస్తుందని, రైతుల ముఖాల్లో చిరునవ్వులు తిరిగి వస్తాయని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
పచ్చిమేత కొరత ఎందుకు ఏర్పడింది?
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం వల్ల పచ్చిగడ్డి పెరగలేదు. దీంతో పశువులకు మేత కొరత ఏర్పడి రైతులు ఎండుగడ్డిపై ఆధారపడుతున్నారు. ఎండుగడ్డి ధరలు పెరగడంతో పశుపోషణ ఖర్చులు కూడా భారీగా పెరిగాయి.
FAQ's
పచ్చిమేత కొరతకు ప్రధాన కారణం ఏమిటి?
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గడం, భూముల్లో పచ్చిగడ్డి మొలకెత్తకపోవడమే ప్రధాన కారణం.
పచ్చిమేత కొరత వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?
పాల ఉత్పత్తి తగ్గుతుంది. పశువుల ఆరోగ్యం దెబ్బతింటుంది. రైతులు పాడి పశువులను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వస్తుంది.
ప్రభుత్వం ఏం చేయాలి?
రాయితీపై పశుగ్రాసం అందించడం, పశుగ్రాస డిపోలు ఏర్పాటు చేయడం, పాడి రైతులకు ఆర్థిక సాయం అందించడం అవసరం.
RELATED ARTICLES...
సాగు సంకటమే.. ఎల్ నినో ప్రభావంతో నిర్మల్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షాభావం
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉక్కపోత తీవ్రం.. 38.4°C ఉష్ణోగ్రత నమోదు, వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు






