సాగు సంకటమే!
కళ్లముందే కరువు.. రైతు గుండె బరువు
నారుపోసిన రైతు.. నీళ్లివ్వని వరుణుడు
- ఎల్ నినో నీడలు
- నిర్మల్ జిల్లాలో లోటు వర్షపాతం
- ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరిసాగుపై ప్రభావం
నిర్మల్/మహబూబాబాద్, జూలై 14 (విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. పంటల సాగుపై ఎల్ నినో నీడలు కమ్ముకున్నాయి. వానాకాలం ప్రారంభమై 50 రోజులు గడుస్తున్నా చిరుజల్లులు తప్ప భారీ వర్షాల జాడలేదు. సీజన్ ప్రారంభం లో కురిసిన వర్షానికి రైతులు పత్తి, మొక్కజొన్న, సోయా విత్తనాలతో పాటు వరి నార్లు పోశారు. ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేశాయి.
నిర్మల్ జిల్లాలో ఈ వానాకాలం 4.38 లక్షల ఎకరాల్లో పంట ల సాగు లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు పత్తి 1.60 లక్షల ఎకరాలు, సోయా 1.20 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 30 వేల ఎకరాల్లో సాగు కాగా.. 1,20,000 ఎకరాల్లో వరి నారు పోసుకున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.
వర్షాలు కురువకపోవడం, ప్రాజెక్టులు, చెరువుల్లో చుక్క నీరు లేక ఇప్పటికే సాగుచేసిన పంటలు వాడుపడుతున్నాయి. కళ్లె దుటే కరువు పరిస్థితులు కనిపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతు న్నారు. వరుణిడి కోసం పూజలు, యాగా లు నిర్వహిస్తున్నారు.
20-40 శాతం లోటు వర్షపాతం..
నిర్మల్ జిల్లాలో జూన్ మాసంలో సాధారణ వర్షపాతం 173.0 మిల్లీ మీట ర్లు కాగా.. 147.5 మిల్లీ మీటర్లు నమోదైంది. జూలై మాసంలో 292.06 మిల్లీ మీటర్ల గాను, ఇప్పటి వరకు 204.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో 18 మం డలాలు ఉండగా కుంటాల, పెంబి, బైంసా మండలాల్లో మాత్రమే సగటు వర్షపాతం నమోదైంది. మిగతా 15 మండలాల్లో 20 శాతం నుంచి 40 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
కళతప్పిన ప్రాజెక్టులు..
జిల్లాలో కడెం, శ్రీరాంసాగర్, గడ్డెన్న సుద్దవాగు, స్వర్ణ, సదర్ మార్ట్, సిరల ప్రాజెక్టులతో 635 చెరువులు ఉన్నాయి. కడెం ప్రాజెక్టు సామర్థ్యం 3.495 టీఎంసీలకు గాను ప్రస్తుతం 0.402 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయంలో 0.548 టీఎంసీల నీరు ఉంది. గడ్డన్న సుద్దవాగు ప్రాజెక్టులో 1.83 అడుగులకు 0.568 అడుగులు మాత్రమే నీరుంది. గత ఏడాది 0.460 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.149 టీఎంసీల మేర నీరుంది.
గత ఏడాది ఇదే సమయంలో 15.672 టీఎంసీల నీరు నిలువ ఉంది. ఇక స్వర్ణ ప్రాజెక్టులో 11 83 అడుగులకు ప్రస్తుతం 11.64 అడుగులు మేర నీరుంది. సదర్ మార్ట్ చీరాల పల్సి రంగరావుకు ప్రాజెక్టులో చుక్క నీరు చేరలేదు. 635 చెరువులు ఉండగావాటిలో కొత్తగా 10 నుంచి 20 శాతం మాత్రమే నీరు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా జూన్ చివరి వారం, జూలై రెండవ వారంలో వర్షాలు కురిస్తే ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరుతుండేది.
జిల్లా పరిధిలోని ప్రాజెక్టులన్నీ ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలపైనే ఆధారపడి ఉంటాయి. ఎగువన కూడా సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. కడెం ప్రాజెక్టు కింద 68,150 ఎకరాలు, గడ్డం వాగు ప్రాజెక్టు 13 వేలు, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్ట్ కింద సరస్వతి కెనాల్ ద్వారా 33 వేలు, స్వర్ణ ప్రాజెక్టు కింద 9,000 ఎకరాలు, చెరువుల కింద 12 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు.
వాడుతున్న పంటలు..
వర్షాలు ముఖం చాటేయడం, ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. భూమిలో తేమ లేకపోవడంతో పత్తి, సోయా మొలకలు కూడా ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. మరోవైపు బోర్లలో నీటి మట్టాలు కూడా పడిపోవడంతో మొలకలకు తడులు అందించే అవకాశం లేకుండాపోయింది.
వరి సాగుపై తీవ్ర ప్రభావం
మహబూబాబాద్ : ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జూన్, జూలై నెలల్లో సాధారణంగా 35 సెం.మీ. నుంచి 40 సెం.మీ.ల వరకు నమోదు కావాల్సి ఉంటుంది. ఇందులో జూన్ నెలలో దాదాపు 13 సెం.మీ, అత్యధిక వర్షపాతం కురిసే జూలై నెలలో దాదాపు 23 సెం.మీ. నుంచి 25 సెం.మీ.ల వరకు సగటున వర్షపాతం సాధారణంగా నమోదవుతుంది. అయితే ప్రస్తుత మొత్తం సీజన్ వర్షపాతం జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారుగా 11.5 సెం.మీ. నుంచి 12.5 సెం.మీ. మధ్య సగటు వర్షపాతం నమోదైనట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇది సాధారణ వర్షపాతంతో పోలిస్తే లోటు వర్షపాతంగా అధికారులు చెపుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వరి పంట సాగు మినహా ఇతర పంటలను దాదాపుగా సాధారణ విస్తీర్ణానికి కాస్త అటు ఇటుగా సాగు చేశారు. వరి సాగు కోసం వర్షాలు అనుకూలించకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. వరి నార్లు పోసుకొని నాట్లు వేయడానికి కొందరు దుక్కి దున్ని సిద్ధం చేస్తుండగా మరి కొంతమంది వర్షాల కోసం నిరీక్షిస్తున్నారు.
వరి సాగు కోసం ప్రధాన చెరువుల కింద నార్లు పోసుకున్న రైతులు, పచ్చి రొట్ట పంటగా జీలుగ సాగు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఎక్కడ కూడా వరి సాగు పంట ఆశించిన రీతిలో కనిపించడం లేదు. మహబూబాబాద్ జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగుచేస్తుండగా, అందులో రెండు లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 16 వేల ఎకరాల్లోనే వరి పంట సాగు చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం లక్ష 30 వేల ఎకరాల్లోనే వివిధ రకాల పంటలు సాగు చేయగా అందులో 83 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఎల్ నినో ఈసారి వరి సాగుపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
తక్కువ పంటకాలం విత్తనాలను సాగు చేయాలని, నీటిని ఎక్కువగా వినియోగించే వరి సాగును తగ్గించి, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని, వర్షాభావ పరిస్థితులు తట్టుకునే విధంగా ఉండే పంటలను సాగు చేయడం మేలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.






