హైదరాబాద్ సెయిలింగ్ వీక్ షురూ
హైదరాబాద్, జూలై 14: హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో భాగంగా మొదటి ఐఎల్‌సీఏ ఓపెనింగ్ ఇంటర్నేషనల్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు హుస్సేన్‌సాగర్ సెయిలింగ్ క్లబ్‌లో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మేజర్ జనరల్ పునీత్ కపూర్ ఈ పోటీలను ప్రారంభించారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సెయిలింగ్ పోటీలకు ఆతిథ్యమివ్వడం తెలంగాణకు గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈఎంఈ సెయిలింగ్ అసోసియేషన్, సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ సంయుక్తంగా ఈ ఛాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇ్పటికే వైఏఐ సర్టిఫికేషన్ కోచింగ్ క్యాంప్, ఇంటర్నేషనల్ రేస్ ఆఫీసర్ సెమినార్, నేషనల్ రేస్ ఆఫీసర్ సెమినార్ నిర్వహించా రు. కాగా ఈ ఛాంపియన్‌షిప్‌లో దేశ, విదేశాలకు చెందిన అత్యుత్తమ సెయిలర్లు పాల్గొంటున్నారు.
ఈ నెల 18 వరకూ పోటీలు జరగనుండగా తొలిరోజు పోటీలు హోరాహోరీగా సాగాయి. సాగర జలాలపై సెయిలర్లు అద్భుత విన్యాసాలతో అలరించారు. గాలులకు ఎదురీదుతూ, అలలపై అలవోకగా విన్యాసాలు చేస్తూ సెయిలర్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు.






