పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
కామారెడ్డి, జూలై 14 (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో పెండింగ్ కేసులను నాణ్యమైన దర్యాప్తుతో సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. పట్టణంలో ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆకస్మికంగా సందర్శించి క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఎస్పీ సిబ్బంది రోల్కాల్ను తనిఖీ చేశారు.
అనంతరం స్టేషన్ అధికారులు, సిబ్బందితో సమావేశమై శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతి ప్రజలకు అందుతున్న సేవలపై సుదీర్ఘ సమీక్షా నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్ను ఆశ్రయించే ప్రతి బాధితుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. నాణ్యమైన దర్యాప్తు ప్రమాణాలను పాటిస్తూ పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రైమ్ ప్రాపర్టీ భద్రతపై ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. స్వాధీనం చేసుకున్న ఆస్తులను చట్టపరమైన నిబంధనల ప్రకారం భద్రపరచాలని, వాటి నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని అన్నారు.
బ్లూ కోలట్స్, పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్పీ తెలిపారు. ట్రాఫిక్ ఎస్‌ఐ చంద్రశేఖర్ను ఉద్దేశించి మాట్లాడుతూ, పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేసేలా సమర్థవంతమైన ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపట్టాలన్నారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, టౌన్ ఎస్‌ఐలు , ట్రాఫిక్ ఎస్‌ఐ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






