బంగారు కొండ!
హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ రవీందర్ ఇంటిపై ఏసీబీ సోదాలు, అరెస్టు
- 100 కోట్ల అక్రమాస్తులు!
- 11 చోట్ల 15 బృందాల తనిఖీలు
- కొండాపూర్, గచ్చిబౌలి, శంషాబాద్‌లో లగ్జరీ ఫ్లాట్లు.. 4 ఎకరాల భూమి
- ఇంట్లో కిలోన్నర బంగారం, 12.5 కిలోల వెండి, 18 విదేశీ మద్యం బాటిళ్లు
- 4 బ్యాంక్ లాకర్లు
రంగారెడ్డి, జూలై 14 (విజయక్రాంతి): రాష్ర్టంలో అవినీతి తిమింగలాల గుండెల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి వణుకు పుట్టించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్‌ను లక్ష్యంగా చేసు కుని అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచే సోదాలు చేపట్టారు. అక్రమాస్తులను గుర్తించి, ఆయనను అరెస్టు చేశారు.
ఏసీబీ డీఎస్పీ మాజిద్‌ఖాన్ నేతృత్వంలో మొత్తం 15 ప్రత్యేక బృందాలు హైదరాబాద్, నిజామాబాద్‌తో పాటు మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. గచ్చిబౌలి సుమధుర టవర్స్‌లోని రవీందర్ ప్రధాన నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీల ఇళ్లలో జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు సాగిన ఈ దాడుల్లో లభ్యమైన దస్తావేజుల ప్రకారం రవీందర్ పేరిట ఉన్న ఆస్తుల ప్రభుత్వ అధికారిక విలువ రూ.50 కోట్లకు పైగా ఉండగా.. బహిరంగ మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
కళ్లు చెదిరే అక్రమాస్తుల చిట్టా
ఐటీ కారిడార్ పరిధిలోని కొండాపూర్‌లో లగ్జరీ ఫ్లాట్లు 2, సుమధుర ఆక్రోపోలిస్‌లో ఒక ఫ్లాట్, శ్రీవారి మెడోస్‌లో మరో ఫ్లాట్, వాసవి అట్లాంటిస్‌లో విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. మసీద్‌బండ ప్రాంతంలో 4 అంతస్తుల భారీ భవనం, జడ్చర్లలో 7 ఓపెన్ ప్లాట్లు, శంషాబాద్, షాబాద్ పరిసర ప్రాంతాల్లో 4 ఎకరాల అత్యంత విలువైన భూమి ఉన్నట్టు గుర్తించారు. ఇంట్లో దాదాపు కిలోన్నర బంగారం, 12.5 కిలోల వెండి ఆభరణాలను అధికారులు గుర్తించి సీజ్ చేశారు.
రూ.3.82 లక్షల నగదు లభించగా, వివిధ బ్యాంకుల్లో రూ.45 లక్షల మేర బ్యాంక్ నిల్వలను (ఫిక్స్‌డ్ డిపాజిట్లు) గుర్తించారు. రూ.10 లక్షల విలువైన లగ్జరీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో దాచిన 18 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రవీందర్‌కు సంబంధించిన 4 బ్యాంక్ లాకర్లను అధికారులు ఇంకా తెరవాల్సి ఉంది. ఈ లాకర్లు కూడా ఓపెన్ చేస్తే అక్రమాస్తుల విలువ వందల కోట్లకు చేరే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు భావిస్తున్నాయి.
ఏఈ టు సీఈ.. కమీషన్ల కోసమే ఫైళ్ల తొక్కిసలాట!
హెచ్‌ఎండీఏలో ఒక సాధారణ అసిస్టెంట్ ఇంజినీర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన బచ్చు రవీందర్.. అదే సంస్థలో చీఫ్ ఇంజినీర్ స్థాయికి ఎదిగారు. అయితే, ఆయన ఉద్యోగ ప్రస్థానం మొదటి నుంచీ వివాదాస్పదంగానే సాగిందనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులను, ఎలివేటెడ్ కారిడార్ల పనులను తనకు కావలసిన కాంట్రాక్టర్లకే కట్టబెడుతూ భారీగా వెనకేసుకున్నట్లు సమాచారం.
మైత్రివనంలోని 7వ అంతస్తులో ఉన్న రవీందర్ ఛాంబర్‌లో సోదాలు చేసినప్పుడు.. నెలల తరబడి పెండింగ్‌లో పెట్టిన కొన్ని కీలక ఫైళ్లు, ఆయన సీసీ సమక్షంలో చేసిన తనిఖీల్లో బయటపడ్డాయి. అలాగే రవీందర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే కొంతమంది కాంట్రాక్టర్ల ప్రత్యేక జాబితా కూడా అధికారుల చేతికి చిక్కింది.
ఈయన వ్యవహారశైలిపై, తనకు నచ్చిన కొద్దిమంది మీడియా ప్రతినిధులను మాత్రమే ప్రాజెక్టుల సందర్శనకు తీసుకెళ్లడంపై ఇటీవల తోటి జర్నలిస్టులు ప్రశ్నించగా.. ‘ఇందులో నాదేం లేదు.. అంతా కమిషనర్‌దే’ అంటూ పొంతన లేని సమాధానాలు చెప్పడం గమనార్హం.
బినామీల వేటలో ఏసీబీ
రవీందర్ తన అక్రమ సంపాదనను బంధువుల పేర్ల మీదే కాకుండా పలువురు బినామీల పేర్లతో పెట్టుబడిగా పెట్టినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న పత్రాల పరిశీలన జరుగుతోంది. రవీందర్‌ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు కోర్టు ముందు హాజరు బాచి జైలుకు తరలించే అవకాశం ఉంది. పూర్తి విచారణ, బ్యాంక్ లాకర్ల ఓపెనింగ్ అనంతరం అక్రమాస్తుల అసలు విలువ మరికొన్ని వందల కోట్లలో తేలనుందని ఏసీబీ వర్గాలు స్పష్టం చేశాయి.






