15 July, 2026 | 1:17 AM

సౌదీపై హౌతీల దాడి

15-07-2026 01:16 AM
  1. అభా ఎయిర్‌పోర్ట్‌పై క్షిపణులు 
  2. సనాలో తమ ప్రతినిధులున్న విమానంపై యెమెన్ దాడికి ప్రతీకారం
  3. ఒమన్ తీరంలో రెండు నౌకలపై ఇరాన్ దాడి 
  4. భారతీయుడు మృతి.. దాడులను ఖండించిన భారత్

సనా/రియాద్, జూలై ౧౪: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగియలేదని, పశ్చిమాసియా రణభూమిగా మారిందని, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారట్లేదని ఒకవైపు యావత్ ప్రపం చం ఆందోళన చెందుతుంటే ఇప్పుడు మరో యుద్ధం తెరమీదకు వచ్చింది. హౌతీ అనే యెమెన్‌కు చెందిన తిరుగుబాటు సంస్థ మంగళవారం సౌదీలోని అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.

అక్కడితో ఆగకుండా విమనాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. సౌదీలో ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు, ఆ దేశస్తులు పర్వతశ్రేణులుండే అభా ప్రాం తానికి వెళ్తారు. పర్వతాల మధ్య ఉండే ఈ ఎయిర్‌పోర్టునే హౌతీ టార్గెట్ చేసిం ది. అయితే..దాడిలో ఆస్తినష్టం, ప్రాణనష్టంపై ఇప్పటివరకు సౌదీ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

తమ ప్రతినిధుల బృందాన్ని తరలిస్తున్న ఇరాన్ విమానం సోమవారం సనా విమానాశ్రయంలో రన్‌వేపై దిగుతుండగా సౌదీఅరేబియా మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వం బాంబు దాడి చేసిందని, ఆ దాడికి ప్రతిగానే తాము ప్రతిదాడికి పాల్పడ్డామని హౌతీ ప్రకటించింది. తాజా దాడితో 2022 నుంచి ఇరుపక్షాల మధ్య కొనసాగుతున్న అనధికారిక ప్రశాంతత ఒక్కసారిగా బద్దలయినట్లయింది.

తమ ప్రతినిధులను ఖైదీలుగా యెమెన్ ప్రభుత్వం బంధించిందని, వారిని విడిచిపెట్టాలనే నాడు హౌతీ గట్టిగా ప్రయత్నాలు చేసింది. ఒక దశలో యెమెన్ ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిపింది. కానీ, ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అప్పటినుంచి హౌతీ నివురుగప్పిన నిప్పులా స్తబ్దుగా ఉండిపోయింది. యెమెన్ ప్రభుత్వం సుమారు ౧౦ ఏళ్ల నుంచి అంతర్యుద్ధాన్ని ఎదుర్కొంటున్నది. బాహ్య శక్తుల ప్రాక్సీ యుద్ధాలకు తాళలేక విలవిలలాడుతున్నది.

౨౦౧౪లో హౌతీలు రాజధాని సనా నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో, అక్కడి ప్రభుత్వం ఆడెన్ నగరాన్ని తమ తాత్కాలిక రాజధానిగా మార్చుకోవాల్సి వచ్చింది. ఈక్రమంలోనే సౌదీ అరేబియా నేతృత్వంలో ౨౦౧౫లో ఒక సైనిక కూటమి ఏర్పాటైంది. ఈ కూటమి హౌతీ సంస్థను తుదముట్టించేందుకు రంగంలోకి దిగింది.

నాడు ఇరుపక్షాల మధ్య జరిగిన దాడుల్లో వేలాది మంది పౌరులు మృతిచెందారు. 2022లో సౌదీ అరేబియా సైనిక కూటమి- హౌతీ తిరుగుబాటుదారుల మధ్య అనధికార కాల్పుల విరమణ ఒప్పందం జరగడంతో, అప్పటి నుంచి ఉద్రిక్తతలు ఆగిపోయాయి. కానీ, తాజా పరిణామాలు ఇరుపక్షాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెంచేలా పరిణమించాయి. 

అమెరికా సాయం కోరిన సౌదీ

తమ దేశంలోని విమానాశ్రయంపై హౌతీ దాడులకు పాల్పడిన నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం అప్రమత్తమైంది. హౌతీపై సైనిక దాడులకు దిగేందుకు సాయం చేయాలని అమెరికాను కోరినట్లు తెలిసింది. సాయం అందించేందుకు అగ్రరాజ్యాధినేత ట్రంప్ కూడా సానుకూలంగా స్పందించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.

ఇరాన్ బాధ్యత వహించాలి: యెమెన్

సనా విమానాశ్రయంపై ఉన్న దిగ్బంధాన్ని ఎత్తివేసే వరకు సౌదీ గగనతలంలోకి ఏ విమానయాన సంస్థలు వెళ్లొద్దని యెమన్ రక్షణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ విమానం సనా విమానాశ్రయంలోకి ప్రవేశించిందని, అందుకే రన్‌వేపైనా దాడి చేశామని స్పష్టం చేసింది. తమ గగనతలంలోకి వచ్చే ఏ శత్రుదేశ విమానాన్నీ వదిలిపెట్టబోమని హెచ్చరించింది. హౌతీ దాడులకు ఇరాన్ నాయకత్వమే బాధ్యత వహించాలని పేర్కొంది.

ఒమన్ తీరంలో అలజడి

ఒమన్ సముద్ర జలాల నుంచి వెళ్తున్న యెమెన్‌కు చెందిన ‘మొంబాసా’, ‘అల్ బహియా’ అనే రెండు చమురు నౌకలపై మంగళవారం ఇరాన్ సైన్యం దాడులు చేసింది. దాడుల్లో ఒక భారతీయ నావికుడు మృతిచెందాడు. మరో ఎనిమిది మంది క్షతగాత్రులయ్యారు. భారత నావికుడు మృతిపై భారత్ తీవ్రంగా ఖండించింది. నౌకలపై దాడి చేయడమంటే, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈమేరకు న్యూఢిల్లీలోని ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మొహమ్మద్ జవాద్ హుస్సేనీకి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్లు జారీ చేసింది. 

20%ట్రాన్సిట్ ఫీజ్.. అంతా తూచ్ !

ట్రంప్ యూటర్న్

వాషింగ్టన్/ టెహ్రాన్, జూలై ౧౪: హోర్ముజ్ జలసంధి నుంచి వెళ్లే ఒక్క నౌక నుంచి ౨౦శాతం రవాణా ఫీజు (ట్రాన్సిట్ టోల్) వసూలు చేస్తామని, జలసంధి తమ నియంత్రణలోనే ఉంటుందని బీరాలు పలికన అగ్రరాజ్య అధినేత ట్రంప్, తన ‘ట్రూత్ సోషల్’ ద్వారా ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటలకే అంతా తూచ్ అన్నారు. రవాణా ఫీజు వసూలు నిర్ణయాన్ని ఉప సంహరించుకున్నట్లు ప్రకటించారు.

అందుకు బదులుగా గల్ఫ్ దేశాలు అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడతాయని ప్రకటించారు. పెట్టుబడులతో అమెరికాతోపాటు గల్ఫ్ దేశాలకూ మేలు జరుగుతుందని, లక్షలాది మంది అమెరికన్లకు అధిక వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయని జోస్యం చెప్పారు. అయితే, ఇరాన్ నౌకాయానంపై మాత్రం అమెరికా దిగ్బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.