15 July, 2026 | 1:20 AM

జల విద్యుత్‌కు ఎల్ నినో షాక్!

15-07-2026 01:20 AM
  1. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం
  2. కృష్ణ, గోదావరిలోకి ఆశించిన స్థాయిలో చేరని నీరు
  3. భారీగా పడిపోయిన జల విద్యుత్ ఉత్పత్తి
  4. అంచనాలు తారుమారు
  5. వచ్చే ఏప్రిల్ నాటికి 220 మిలియన్ యూనిట్లకే పరిమితమయ్యే అవకాశం
  6. ప్రత్యామ్నాయ ప్రణాళికలు తప్పనిసరి అంటున్న నిపుణులు

హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో రాష్ర్టంలో వర్షాభావ పరిస్థితులు ముదురుతున్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లోకి ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహాలు లేకపోవడంతో జల విద్యుత్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే ఉత్పత్తి భారీగా పడిపోగా.. రాబోయే కాలంలో విద్యుత్ ప్రణాళికలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. గత ఏడాది ఏప్రిల్ వరకు సుమారు 393 మిలియన్ నిట్ల జల విద్యుత్ ఉత్పత్తి కాగా.. వచ్చే ఏప్రిల్ నాటికి అది 220 మిలియన్ నిట్లకు పరిమితం కావచ్చనే అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి.   

సాగర్ మినహా.. అన్ని ప్రాజెక్టుల్లో ఉత్పత్తి నిల్

 రాష్ర్టంలో జల విద్యుత్‌కు ప్రధాన ఆధారాలుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు జూరాల, పులిచింతల, పోచంపాడు వంటి ప్రాజెక్టులు విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.

జూన్‌లో నాగార్జునసాగర్‌లో మాత్రమే సాధారణ స్థాయిలో విద్యుత ఉత్పత్తి కాగా శ్రీశైలంలో ఒక్క యూనిట్ కూడా ఉత్పత్తి కాలేదు. మిగతా జల విద్యుత్ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. భారీ వర్షాలు కురువకపోతే జల విద్యుత్ కేంద్రాలు పూర్తిగా మూతపడే అవకాశం లేకపోలేదని విద్యుత్ నిపుణులు అంటున్నారు.  

మూడేళ్లుగా ఇదీ పరిస్థితి..

రాష్ర్టంలోని జల విద్యుత్ కేంద్రాల్లో గడిచిన మూడేళ్లుగా (20 ఉత్పత్తిని పరిశీలిస్తే వర్షపాతం ఆధారంగా భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. సాధారణ వర్షపాతం ఉన్న సంవత్సరాల్లో జలాశయాల్లో నీటి లభ్యత మెరుగ్గా ఉండటంతో ఉత్పత్తి పెరిగింది. కానీ, ఈ ఏడాది వర్షాల లోటు కారణంగా జల విద్యుత్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో నిచేయలేకపోతున్నాయి.

* 2025లో పరిశీలిస్తే ఏప్రిల్‌లో 56.53 మిలియన్ యూనిట్లు,  మే నెలలో 84.39 మిలియన్ యూనిట్లు, జూన్‌లో 251.82 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి కాగా.. జూలైలో  958.15 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి నమోదైంది.

* 2026లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఏప్రిల్‌లో 76.45 మిలియన్ యూనిట్లు, మేలో 78.70 మిలియన్ యూనిట్లు, జూన్‌లో కేవలం 64.91 మిలియన్ యూనిట్ల జల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అయ్యింది. ఇందులోనూ నాగార్జునసాగర్ నుంచే కొంతమేర ఉత్పత్తి జరగగా.. దిగువ జూరాల, పులిచింతల, పోచంపాడు కేంద్రాలు తక్కువ స్థాయిలోనే పనిచేశాయి. మిగిలిన కేంద్రాల్లో ఉత్పత్తి దాదాపు నిలిచిపోయింది.

జలాశయాలు వెలవెల

ప్రతి ఏడాది నమోదయ్యే సాధారణ వర్షపాతంలో జూన్ నెల వాటా సుమారు 14 నుంచి 15 శాతం ఉంటుంది. అయితే ఈ వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు, జూన్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ర్టంలోని ప్రధాన జలాశయాల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదు. జూన్ 1 నుంచి జూలై 13 వరకు రాష్ర్టంలో సాధారణంగా 219.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 158.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 28 శాతం లోటు నమోదైంది. జూలైలోనూ ఇప్పటి వరకు భారీ వర్షాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎల్‌నినో ప్రభావం కారణంగానే వర్షాలు తగ్గాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

విద్యుత్ రంగంపై పెరుగుతున్న ఒత్తిడి

రాష్ర్టంలో నిరంతర విద్యుత్తు సరఫరాకు జల విద్యుత్ కేంద్రాలు ఇప్పటివరకు కీలకంగా నిలిచాయి. కృష్ణ, గోదావరి నదులకు భారీ వరదలు వచ్చిన సమయంలో జల విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగేది. అయితే ఈ ఏడాది సాధారణ ఎల్‌నినో వల్ల సాధారణ వర్షపాతం కూడా అనుమానంగా మారడంతో జల విద్యుత్‌పై ఆధారపడే పరిస్థితి తగ్గుతోంది. లోటు వర్షపాతం కారణంగా వచ్చిన నీరు మొదట తాగునీరు, సాగునీటి అవసరాలకే వినియోగించాల్సి ఉంటుంది.

భారీ వరదలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా రాష్ట్ర విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. జల విద్యుత్ లోటును ఎలా అధిగమిస్తుందనే అంశంపై ప్రభుత్వం తీసుకునే చర్యలు కీలకంగా మారనున్నాయి.