17 July, 2026 | 3:03 AM

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు

17-07-2026 02:45 AM

- ప్రజల సంరక్షణ, భద్రతకై కమ్యూనిటీ కాంటాక్ట్ ల నిర్వహణ

- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఇచ్చోడ, జూలై 16 (విజయక్రాంతి) : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తప్పవని, ప్రజల రక్షణ, సంరక్షణ సక్రమంగా నిర్వహించడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ లను నిర్వహిస్తున్నామని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ అన్నారు. గురువారం ఉదయం ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు.

యువత అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దొంగతనాలు, దోపిడీలు చేయకుండా, సత్ప్రవర్తనతో మెదలాలని అన్నారు. గొడవలకు దారి తీసేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వీడిసి అక్రమాలు, బలవంతపు వసూళ్లు, నంబర్ ప్లేట్లు లేకుండా తిరగడం, దొంగ వాహనాలను కొనుగోలు చేయవద్దన్నారు. కార్డన్ సెర్చ్ లో సరైన ధ్రువ పత్రాలు లేని 156 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 8 కార్లు, బొలెరోలను స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా కల్తీ కళ్ళు తయారు చేయడానికి ఉపయోగపడే క్వింటల్ అమ్మోనియం బైకార్బొనేట్ స్వాధీనం చేసుకొని సురేందర్ గౌడ్ పై, అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న శ్రీనివాస్ గౌడ్ లపై కేసు నమోదు చేసి 200 బాటిళ్ల మద్యం సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పి రుత్వీక్ సాయి కొట్టే, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ఎన్ వెంకట నరసయ్య, ఎఆర్ డిఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సిఐ నరేష్, రిజర్వ్ సిఐ డి వెంకటి, టి మురళి, ఎస్త్స్రలు, స్పెషల్ పార్టీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.