11-02-2026 03:06:37 AM
ద్విచక్ర వాహనాలపై తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): హైదరాబాద్ లో మరోసారి హవాలా రాకెట్ గుట్టురట్టయింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచడంతో అక్రమ నగదు రవాణా బట్టబయలవుతోంది. గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు రూ. 77 లక్షల లెక్కలు లేని నగదు పట్టుబడింది. అసలేం జరిగింది.. గోషామహల్ పరిధిలోని జ్ఞాన్ బాగ్ కాలనీలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా నగదు తరలిస్తున్నారని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది.
దీంతో సోమవారం సాయంత్రం గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ షాప్ వద్ద పోలీసులు మాటు వేశారు. రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను అడ్డుకొని తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న మూడు బ్యాగుల్లో కట్టల కొద్దీ నోట్లు బయటపడ్డాయి. పట్టుబడిన వ్యక్తులను జోతారామ్, గణపతి రామ్, మహేందర్ అలియాస్ రాకేశ్ దేవాసిగా పోలీసులు గుర్తించారు. బ్యాగుల్లో ఉన్న డబ్బుకు సంబంధించి వారిని ప్రశ్నించగా.. ఎలాంటి పత్రాలు చూపించలేకపోయారు, సంతప్తికరమైన సమాధానం చెప్పలేదు.
దీంతో వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, పంచనామా నిర్వహించి నగదును లెక్కించగా మొత్తం రూ. 76,87,650 డ్బ్బు ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై ఉన్నట్లు తేలింది.నిందితులను విచారించగా హవాలా లింకులు వెలుగులోకి వచ్చాయి. కల్పేశ్ అలియాస్ కపారామ్ అలియాస్ కార్తీక్ ఆదేశాల మేరకు.. బేగంబజార్‌కు చెందిన సందీప్ అనే వ్యక్తి నుంచి ఈ డబ్బును సేకరించినట్లు నిందితులు అంగీకరించారు. ఈ నగదును అఫ్జల్‌గంజ్‌లో ఉండే తగరం అనే వ్యక్తికి చేరవేసేందుకు వెళ్తుండగా పోలీసులకు చిక్కారు. పట్టుబడిన నగదును సీజ్ చేసి, తదుపరి చర్యల నిమిత్తం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు గోషామహల్ పోలీసులు తెలిపారు.