11-02-2026 03:08:03 AM
ఉదయం 7.00 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఎన్నికలు
తప్పక ఏదేని గుర్తింపు కార్డుతో పోలింగ్ బూతుకు రావాలి
ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
సూర్యాపేట, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఆయన మాట్లాడారు.
ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాటు పూర్తి చేశామన్నారు. జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీలో ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
నేడు జరగనున్న ఎన్నికల సందర్బంగా పోలింగ్ బూతుల వద్ద ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకు నేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చే సమయంలో గుర్తింపు కార్డులలో ఏదైనా ఒకటి తీసుకొని రావాలన్నారు.
వీటిలో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫోటో కూడిన పోస్టు ఆఫీసు కార్డు, డైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, లేబర్ గుర్తింపు కార్డు, ఇండియన్ పాస్ పోర్టుతొ జారీ చేయబడిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, దివ్యాంగుల గుర్తింపు కార్డు, అధికారిక గుర్తింపు కార్డులు తదితర వాటిలో ఏదైనా ఒక దానిని చూపించి ఓటు వేయవచ్చన్నారు.
జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో 141 వార్డులలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం 446 పోలింగ్ అధికారులు, 446 ఏపీఓ, 1340 ఓపిఓ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 51 మంది జోనల్ అధికారులు, 46 మంది రూట్ అధికారులు నియమించామన్నారు. స్వేచ్ఛ, న్యాయబద్ధ ఎన్నికల నిర్వహణకు 10 ఎస్‌ఎస్ టీ, 15 ఎఫ్ ఎస్ టీ, 7 వీవీటి, ఏటి 7బృందాలు ఏర్పాటు చేశామన్నారు.
పోటీదారుల వ్యయ నియంత్రణకు 5 గురు ఏఇఓ లు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. 55 మంది మైక్రో అబ్జర్వార్లను నియమించామన్నారు. ఎన్నికల సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు, తిరిగి పోలింగ్ కేంద్రాల నుండి స్ట్రాంగ్ రూమ్ కు తరలింపుకు 46 బస్సులను సిద్ధం చేయడంతో పాటు పోలీస్ ఎస్కార్టుతో బందోబస్తుకు కార్యాచరణ చేసినట్లు తెలిపారు.
అనంతరం జనరల్ అబ్జర్వర్ పాండదాస్, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూ షన్ కేంద్రాన్ని, కౌంటింగ్ సెంటర్ ను పరిశీలించి పలు సూచనలు చేశారు. వీరి వెంట ఆర్డిఓ వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.