13-02-2026 05:27:09 PM
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారులను అడ్డం పెట్టుకుని విజయం సాధించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ భారీగా అక్రమాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు వీరోచిత పోరాటం చేశారని చెప్పారు. 700-800 డివిజన్లు గెలుస్తామని భావించినట్లు వెల్లడించారు. దాదాపు 30 శాతం మున్సిపాలిటీలు గెలుస్తామని అనుకున్నామన్నారు.
ఓవరాల్ గా బీఆర్ఎస్ మంచి ఫలితాలే సాధించినట్లు భావిస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. హంగ్ వచ్చిన చోట కాంగ్రెస్ పార్టీ(Congress Party) మరింత అక్రమాలకు పాల్పడే అవకాశముందని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ పీఠాల కైవసానికి కాంగ్రెస్ అప్పుడే బేరసారాలు, కొనుగోళ్లు మొదలు పెట్టిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. కలిసొచ్చే తటస్థులను కులుపుకుని పోయేందుకు సిద్ధంగా ఉన్నామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీని ఎదుర్కొనేది బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ను దీటుగా ఎదుర్కొంటామన్నారు. భవిష్యత్ లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని వివరించారు. 15 మున్సిపాలిటీల్లో తాము స్పష్టంగా గెలిచినట్లు కేటీఆర్ సూచించారు. మరో 37 మున్సిపాలిటీల్లో తమకు మంచి ఫలితాలు వచ్చి.. హంగ్ పరిస్థితి ఉందన్నారు. హంగ్ మున్సిపాలిటీలు ఎవరికి దక్కుతాయో చూడాలన్నారు. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. విజయాలు చూసి విర్రవీగిన వారికి కాలమే గుణపాఠం నేర్పుతుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి కూడా గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని కేటీఆర్ వెల్లడించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు.