2 May, 2026 | 4:55 PM

కేటీఆర్ రైతు సదస్సుకు తరలిరండి

02-05-2026 03:30 PM

మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పిలుపు

​మహబూబాబాద్, (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఆధ్వర్యంలో ఏప్రిల్ 6న వరంగల్లో నిర్వహించనున్న భారీ రైతు సదస్సును విజయవంతం చేయాలని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బాణోత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడేందుకు, రైతులకు భరోసా కల్పించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు, మద్దతు ధర లేక అల్లాడుతున్న అన్నదాతల గళాన్ని వినిపించేందుకు ఈ వేదిక అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

మహబూబాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుండి రైతులు, పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సదస్సును జయప్రదం చేయాలన్నారు. ​రైతు సమస్యలే అజెండాగా,  అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం, రైతు బంధు, రుణమాఫీ వంటి అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రైతు పక్షపాతి అని, మన హక్కుల కోసం కేటీఆర్ నాయకత్వంలో ఐక్యంగా పోరాడాలని శంకర్ నాయక్ కోరారు. ​ఈ సదస్సు ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులు తమ పరిధిలోని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి, వాహన ఏర్పాట్లతో సదస్సుకు హాజరు కావాలని ఆయన సూచించారు.