2 May, 2026 | 4:40 PM

విద్యార్థులు చదువుతోపాటు కళల్లోను రాణించాలి

02-05-2026 03:27 PM

వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

శిబిరం ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

గద్వాల,(విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు వివిధ కళల్లోను రాణించాలని, బాల భవన్ లో వివిధ అంశాల్లో ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గద్వాల బాలభవన్ లో ఏటా నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాన్ని శనివారం జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అలాగే బాల భవన్ వ్యవస్థాపకులు, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, మాజీ శాసనసభ్యులు పాగ పుల్లారెడ్డి 107వ జయంతి సందర్భంగా మొదట ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో పిల్లలు సెల్ ఫోన్స్, టీవీలు చూస్తూ సమయాన్ని వృధా చేయకుండా బాల భవన్ లో నేర్పించే శాస్త్రీయ, జానపద నృత్యం, చిత్రలేఖనం, సంగీతం, తదితర అంశాలపై  తర్ఫీదు పొందితే గొప్ప కళాకారులుగా రాణించేందుకు అవకాశం ఉందన్నారు. ఒకే అంశంలో కాకుండా భిన్న రంగాల్లో శిక్షణ పొంది బహుముఖ ప్రజ్ఞాశాలురు గా పేరుపొందాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తాము నేర్చుకున్న  నృత్యం, సంగీతాన్ని వేదికలపై స్టేజ్ ఫియర్ లేకుండా ధైర్యంగా ప్రదర్శించాలని సూచించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా త్వరలో విద్యా వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, అందులో ఒకరోజు బాలభవన్ లో ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాల భవన్ విద్యార్థులతో నేర్చుకునే వివిధ అంశాల గురించి, వారి భవిష్యత్తు లక్ష్యాల గురించి మాట్లాడారు. అంతకుముందు బాల భవన్ పర్యవేక్షకులు విజయలక్ష్మి తమ పూర్వ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చూపిన ప్రతిభ, సాధించిన అవార్డులు, అక్కడ ఇస్తున్న శిక్షణ గురించి క్షుణ్ణంగా వివరించారు.