ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు
- సీఎం పదవి పోయిందని కేటీఆర్ కు చాలా బాదుంది
- నేను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలే
- దానం అప్పుడైనా పులే.. ఇప్పుడైనా పులే
- పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేంటి?
- బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే
- నన్ను ఎంపీగా ఓడించారు
- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీఎం జెండా గెలుస్తుంది
బీజేపీ, బీఆర్ఎస్, కేటీఆర్(KTR)పై దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ భేటీకి(BRSLP Meeting) తనను ఎందుకు పిలవలేదని దానం మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ తనను వివరణ అడగలేదని దానం తెలిపారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేంటి?, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితకు మంత్రి పదవులు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు పార్టీ గానీ, కేసీఆర్ గానీ తను ఏమీ అడగలేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే.. ఇద్దరు కలిసి తనను ఎంపీగా ఓడించారని ఆరోపించారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్న దానం నాగేందర్, తనకు చట్టాల గురించి తెలుసన్నారు. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే, నిన్నటి ఓరియెంటేషన్ కు ఎందుకు పిలవలేదు, క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. తాను కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోలేదని, భారత పౌరుడిగా ఏ పార్టీ నుంచైనా పోటీచేసే హక్కు తనకు ఉందని వివరించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జెండా గెలుస్తుందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 300 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయం వ్యతిరేకంగా వచ్చినా పోటీకి సిద్ధంగా ఉన్నానని తేల్చిచెప్పారు. దానం అప్పుడైనా పులి.. ఇప్పుడైనా పులే అన్నారు.
2024లో కాంగ్రెస్‌కు విధేయులుగా మారారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది బీఆర్ఎస్ శాసనసభ్యులపై దాఖలు చేసిన పిటిషన్‌లను స్పీకర్ తిరస్కరించారు. అంతకుముందు, డిసెంబర్ 2025లో, ఐదుగురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్ రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి. ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. తరువాత జనవరి 15న పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy), కాలే యాదయ్యపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసారు. ఆ తర్వాత ఫిబ్రవరి 4న సంజయ్ కుమార్‌పై దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించారు.
అన్ని కేసుల్లో, ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని నిరూపించే ఆధారాలను పిటిషనర్లు సమర్పించడంలో విఫలమయ్యారని స్పీకర్ తీర్పు ఇచ్చారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను వర్తింపజేయలేమని స్పష్టం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్‌లో చేరారని, అసెంబ్లీలో ట్రెజరీ బెంచీలపై కూడా కూర్చున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. అయితే, ఎమ్మెల్యేలు ఆ ఆరోపణను ఖండించారు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు కోరేందుకు మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(Chief Minister Revanth Reddy) కలిశామని పేర్కొన్నారు.




