మీ-సేవ కేంద్రాల్లో అధిక చార్జీలు వసూలు చేయవద్దు
ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే సేవలు అందించాలి-
- జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
నల్లగొండ టౌన్, జూలై 3: మీ-సేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన యూజర్ చార్జీలకే సేవలు అందించాలని, ప్రజల నుండి అధిక చార్జీలు వసూలు చేయవద్దని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మీ-సేవ కేంద్రాల ఆపరేటర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని మీ-సేవ కేంద్రాల యజమానులు, ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో నిర్ణయించిన రేట్ల కంటే అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారమే చార్జీలు తీసుకోవాలని, అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక వ్యక్తికి సంబంధించిన పత్రాల స్థానంలో మరొకరి పత్రాలను నమోదు చేయడం వంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
మీ సేవలో డాక్యుమెంట్ల కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివరాలను పరిశీలించి సరైన సమాచారం నమోదు చేయాలని తెలిపారు.విద్యా సంవత్సరం ప్రారంభమైనందున విద్యార్థుల ప్రవేశాలు, సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు మీ-సేవఅందించేసేవలను వినియోగించుకుంటారని, వారి నుండి ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయవద్దని ఆదేశించారు.మీ -సేవ కేంద్రాలు నిర్ణీత సమయపాలన పాటించాలన్నారు.మిర్యాలగూడ రోడ్డులోని టూ బీహెచ్కే కాలనీ, గొల్లగూడ ప్రాంతాల్లో కొత్త మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉందని తెలిపారు.
స్వయం సహాయక సంఘాల సభ్యులు మీ సేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోలన్నారు.పాఠశాల విద్యార్థులకు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలు తదితర సేవలను మీ సేవ కేంద్రాల ద్వారా సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో రెవిన్యూ అధికారి దశరథ, మీసేవ జిల్లా అధికారి రాజశేఖర్, ఈడీఎం దుర్గారావు, ఏపీ డి శ్రవణ్ కుమార్,మీసేవ జిల్లా అధ్యక్షుడు రవి, మీసేవ ఆపరేటర్లు యాజమాన్యాలు పాల్గొన్నారు.






