బీజేపీ వైఫల్యమే
- మహిళా సాధికారతపై చిత్తశుద్ధి లేదు
- బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): మహిళా బిల్లు వైఫల్యానికి పూర్తి కారణం బీజేపీ. డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టారు. అన్ని పార్టీలు రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా, బీజేపీ రాజకీయంతోనే బిల్లు వీగిపోయింది. ఇప్పటికైనా వెంటనే డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళలకు రిజర్వేషన్లు వచ్చేలా కొత్తబిల్లు తీసుకువచ్చి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.
కావాలనే డీలిమిటేషన్ పేరుతో చిక్కుముళ్లు వేసి విఫలమయ్యారు. మహిళా సాధికారతపై బీజేపీకి చిత్తశుద్ధి లేదన్నా తేటతెల్లమైపోయింది. 543 లోక్‌సభ సీట్లతోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే సమస్య వచ్చేది కాదు. దక్షిణాది ప్రాంతాల ఆందోళనలను, డీలిమిటేషన్ పర్యవసానాలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు పోవడంతో ఒక చారిత్రక అవకాశం చేజారిపోయింది. రిజర్వేషన్ పేరుతో ఆడిన నాటకాన్ని దేశమంతా కళ్లారా చూసింది.
మహిళలకు వెన్నుపోటు పొడిచిన పార్టీగా బీజేపీ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ పునర్విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల పెంపు తమ హక్కు. జమ్మూకశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లో దేశవ్యాప్త డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా సీట్ల పెంపు చేపట్టి, తెలంగాణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా తెలంగాణ అసెంబ్లీ సీట్లను 2028 లోపు పెంచేలా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రత్యేక బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు.






