కాళేశ్వరం కథ కంచికేనా?
సీబీఐ విచారణపై కేంద్రం అనాసక్తి
హైకోర్టు ఉత్తర్వులతో ప్రభుత్వంలో నిస్తేజం
- సుప్రీం కోర్టుకు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం
- రాజకీయ విమర్శలకే కాంగ్రెస్ పరిమితం
హైదరాబాద్, జూన్ 1౭ (విజయక్రాంతి): కాళేశ్వరంపై ఏమైంది.. ఏమవుతోంది.. ఇప్పు డు అందరిలోనూ తలెత్తుతున్న ప్రశ్నలివి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవినీతిపై ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదికతో ఇందులో భాగస్వాములైనవారందిరిపై చర్యలు తప్పవనే ఉత్కంఠ అందరిలోనూ అప్పట్లో వ్యక్తమైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీరుతో.. ఈ చర్యలు.. మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కిలాగా తయారైందనే విమర్శలు పెరుగుతున్నాయి.
ఎందుకంటే.. రాజకీయంగా ఎంతో ఉద్విక్తతకు, ఉద్రేకానికి, విమర్శలు, ప్రతివిమర్శలకు తావు తీసిన కాళేశ్వరంపై విచారణ నివేదిక..ప్రకారం చర్యలు తీసుకోవడంలో మాత్రం ఒక్క అడుగుకూడా ముందుకు సాగడం లేదు. పైగా ప్రభుత్వం తీరుకూడా కేవలం రాజకీయంగా విమర్శించడానికే కాళేశ్వరం అంశాన్ని ఉపయోగించుకున్నట్టుగా కనపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో రాజకీయ దూమరం
కాళేశ్వరంపై జస్టిస్ పీసీఘోష్ కమిషన్‌చేసిన విచారణ నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోరుతూ.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్‌కే జోషి, స్మితా సబర్వాల్ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘకాలం విచారించిన రాష్ట్ర హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్ 22న ఉత్తర్వులు జారీచేస్తూ.. సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా విచారణ జరిగిందని, సరైన అవకాశం ఇవ్వలేదని, విచారణ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీచేసింది.
కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాళేశ్వరంపై చేసిన హడావుడి.. కమిషన్ ఏర్పాటు, విచారణ, నివేదిక తరువాత.. కేబినెట్‌లో చర్చిండం.. వగైరా రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాదాపు రెండు నెలల కాలం గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఎలా ముందుకెళదామనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చిన దాఖాలాలు కనపడటం లేదు.
హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వెంటనే స్పందించిన ప్రభుత్వం.. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తేల్చి చెప్పింది. వెంటనే అధికారులు, మంత్రుల బృందంకూడా ఢిల్లీకి వెళ్లింది. కానీ రెండు నెలల కాలం గడుస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. కనీసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారా.. వేశారా.. ఏం జరిగిందనేదానిపై ఎలాంటి సమాచారం బయటకు రావడంలేదు.
కానీ ఇప్పటి వరకు పిటిషన్ వేసిన దాఖలాలు లేవని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ అంశంపై స్తబ్ధత నెలకొందనే చెప్పవచ్చు. ఏం చేయాలనేదానిపై ఒక నిర్ణయం తీసుకోకపోవడంతోనే ఈ సంధిగ్ధత నెలకొందని వారంటున్నారు.
వేల కోట్లు ఖర్చు
రూ. వేల కోట్ల ప్రజాధనంతో ముడిపడిన కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ అనేది ఎంతో కీలకం. అయితే సరైన సమయం ఇవ్వలేదని, సహజ న్యాయ సూత్రాల ప్రకారం విచారణ జరగలేదని, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. జరిగిన విచారణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో అటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.
అదే సమయంలో.. సహజన్యాయ సూత్రాల ప్రకారం ముందుకు వెళ్ళడానికి, చట్టం, నిబంధనల ప్రచారం మరోసారి విచారణకు ఆదేశిస్తారా అనేదికూడా తేలడం లేదు. దీనికితోడు.. సీబీఐ విచారణను వేగవంతం చేసేలా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బంతి మీ కోర్టులో ఉంది.. మాకేం సంబంధం లేదన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాళేశ్వరంపై చేసినంత హడావుడి.. నివేదిక వచ్చిన తరువాత చర్యల విషయంలో కనపడటం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదో తూతూ మంత్రంగా వ్యవహరించడమే తప్ప.. నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడంపై దృష్టి పెట్టడం లేదని వారంటున్నారు. ఏదో రాజకీయ లబ్ధి తప్పితే.. రూ. వేలకోట్ల ప్రజా ధనంతో ముడిపడిన కాళేశ్వరంపై కంటి తుడుపు చర్యగా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విమర్శలు వినపడుతున్నాయి.
2023 డిసెంబరులో ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎంత దూకుడుగా వ్యవహరించారో.. అదే దూకుడును.. కాళేశ్వరంపై ఏదో ఒకటి తేల్చి.. చర్యలు తీసుకునేవరకు కొనసాగించాలని.. అప్పుడే ప్రజల్లో విశ్వాసం పాదుకుంటుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. లేకపోతే.. కంచికి చేరిన కథల్లో.. కాళేశ్వంకూడా ఒకటవుతుంది..!
పడకేసిన సీబీఐ విచారణ
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను శాసనసభలో చర్చించిన అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలోనే ప్రకటించారు. కేంద్రానికి తమ నిర్ణయంపై అధికారిక సమాచారాన్ని అందించారు. కానీ సీబీఐ విచారణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
అయితే రాజకీయంగా కాంగ్రెస్‌తో వైరుధ్యం నెల కొన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీబీఐ విచారణను తొక్కిపెడుతోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపి స్తున్నారు. కానీ రాష్ట్ర హైకోర్టు తీర్పు నేపథ్యంలో జస్టిస్ పీసీఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం ముందుకు వెళ్లడం సరైంది కాదనే అభిప్రాయం కేంద్రంలో నెలకొందని పార్టీ వర్గా లు అంటున్నాయి. ఈ నేపథ్యంలో అటు సీబీఐ విచారణకూడా చలనం లేకుండా పడిఉంది.






