మహనీయుల స్పూర్తితో వివక్ష లేని సమాజమే ఎమ్మార్పీఎస్ ధ్యేయం
అర్మూర్, ఆగస్టు 3 (విజయక్రాంతి): మహనీయుల స్పూర్తితో వివక్ష లేని సమాజమే ఎమ్మార్పీఎస్ ద్యేయమని ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మాసాయిపేట యాదగిరి మాదిగ అన్నారు. సోమవారం ఆర్మూర్ లోని సిద్దుల గుట్ట పక్కన ఎం.ఎస్. ఫంక్షన్ హాల్ లో ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ సమావేశం జరిగింది.
ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ మైలారం బాలు మాదిగ అధ్యక్షత వహించగా యాదగిరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మహనీయుల ఆలోచన విధానమే ఎమ్మార్పీఎస్ పోరాట మార్గమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కులం, మత వివక్ష లేని సమాజ నిర్మాణం కోసం మాదిగ యువత నడుం బిగించాలని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి శాశ్వత మిత్రులు కాని శాశ్వత శత్రువులు లేరని అన్నారు. సమాజంలో అణగారిన వర్గాల పక్షాన పోరాటమే ఎమ్మార్పీఎస్ దేయమని తెలియజేశారు.
మూడు దశాబ్దాల దండోరా ఉద్యమంలో సమాజ హితం కోసం ఎమ్మార్పీఎస్ పాటుపడిందని అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో అన్ని మండల, గ్రామ నూతన కమిటీల నియామకం చేపడుతున్నామని, అందులో భాగంగా మండలాలకు ఇన్చార్జిలను ప్రకటించామని అన్నారు. గ్రామ, మండల కమిటీలలో మాదిగ యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కో ఇన్చార్జ్ నాగం రాజేష్ మాదిగ, రాష్ట్ర నాయకురాలు పద్మ మాదిగ, సీనియర్ నాయకులు మార్క్, సంతోష్, మైలారం రాము, పైడాకుల ప్రశాంత్, మద్దూరి తరుణ్, నూతపల్లి గంగ నర్సయ్య మాదిగ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






