పార్టీ టికెట్‌కు గ్యారంటీ లేదు!
బీజేపీలో చేరికలకు బ్రేక్
- అడ్డంకిగా జాతీయ నాయకత్వం కండీషన్స్
- ఎన్నికల సమయంలో అభ్యర్థులు క్యూ కడతారని ధీమా
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వలసల వరద వస్తుందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాష్ట్రంలోని ఇతర పార్టీల నుంచి నేతలు గుంపులుగా వస్తారని, గేట్లు బార్లా తెరిచి ఉంచామని జాతీయ, రాష్ట్ర నాయకత్వం సైతం ఇటీవల సంకేతాలు ఇచ్చింది. కానీ అదే నాయకత్వం పెట్టిన షరతులతో పార్టీలో చేరికలకు బ్రేక్ పడినట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇతర పార్టీల నుంచి క్యూ కడతారనుకున్న నేతల చేరికలు నెమ్మదించాయి. చోటామోటా వ్యాపారులు, నేతలు మినహా పెద్ద స్థాయి నాయకులెవరూ బీజేపీలో చేరింది లేదు. కారణం, పార్టీలో చేరేవారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని హామీ ఇవ్వమని కమలం పార్టీ నాయకులు తెగేసి చెప్పడమే. దీంతో చేరికలు ఆగిపోయినట్లుగా తెలుస్తోంది.
పార్టీలో చేరికలకు గేట్లు బార్లా తెరిచామని, రానున్న రోజుల్లో చేరికలు భారీగా ఉంటాయని ఇటీవల పార్టీ ఇన్‌చార్జ్ అభయ్‌పాటిల్ చెప్పుకొచ్చారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్లను ఆహ్వానించాల్సిందేనని పార్టీ ఇన్‌చార్జ్ సునీల్ బన్సల్ కూడా సంకేతాలిచ్చారు. కానీ వాస్తవంలో పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. గతంలో ఏ పార్టీ నుంచి అయినా బీజేపీలోకి వచ్చిన వారికి వెంటనే పదవి ఇస్తామనో, టికెట్ కేటాయిస్తామనో హామీ ఉండేది.
కానీ ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం కఠినంగా వ్యవహరిస్తూ, జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఇప్పుడే హామీ ఇవ్వడం కుదరదని.. పార్టీలో చేరాలనుకునే వారికి చెప్తున్నట్లుగా తెలిసింది. ముందు పార్టీ లైన్ ప్రకారం పనిచేయడంతోపాటు ప్రజల్లో మీ సత్తా ఏంటో నిరూపించుకోవాలి... ఆ తర్వాతే టికెట్ గురించి ఆలోచిద్దామని చెప్తున్నట్లుగా పార్టీ వర్గాలు అంటున్నాయి.
కొన్ని రోజుల క్రితం మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు చిట్‌చాట్ చేస్తూ.. పార్టీలో చేరేందుకు ఇతర పార్టీల నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, అయితే వారిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీలో ఉండేలా వారిని పట్టుకుని ఉండడమూ కష్టమే అని పేర్కొన్నారు. వచ్చే నేతలను హామీ ఇవ్వకుండా, పార్టీలోనే ఉండేలా కంట్రోల్ చేయడమూ కష్టమే.
ఇక్కడ టికెట్ రాదని తెలిస్తే మళ్లీ వారంతా వేరే పార్టీలో చేరే పరిస్థితులు రాజకీయాల్లో సర్వసాధారణమే. ఇప్పుడు బీజేపీ విధిస్తున్న ఈ ఒక్క షరతే ఇతర పార్టీల నేతలకు అడ్డంకిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశతో, ఏదైనా పదవి ఆశతో వస్తున్న నేతలకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. టికెట్ హామీ ఇవ్వకుంటే పార్టీ మారాలనే రిస్క్ తీసుకోలేమని నేతలు వెనక్కి తగ్గుతున్నట్లుగా తెలుస్తోంది.
తొందరపడని నాయకత్వం..
బీజేపీ నాయకత్వం మాత్రం తొందరపడడం లేదు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి పార్టీలో చేరేందుకు భారీగా అభ్యర్థులు క్యూ కడతారనే ధీమాతో ఉంది. గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదు.. డబ్బు, పలుకుబడి ఉందని వచ్చి, తర్వాత పార్టీని ఇబ్బంది పెట్టే నేతలను దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీకి బలమైన క్యాడర్ బేస్ ఉంది. బయటి నుంచి వచ్చే నేతల వల్ల ఆ క్యాడర్‌లో అసంతృప్తి రాకూడదనేది అగ్రనాయకత్వం ఆలోచన.
గత ఎన్నికల్లో బయటి నుంచి వచ్చిన కొంతమంది నేతలకు వెంటనే టికెట్లు ఇవ్వడంతో స్థానిక క్యాడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. తాము అనేక ఏళ్లుగా పార్టీని మోస్తున్నాం, వచ్చిన వెంటనే వాళ్లకు టికెట్ ఇస్తారా? అనే గొంతులు వినిపించాయి. బీజేపీ చేరికల కమిటీ కూడా అంతా యాక్టివ్‌గా కనిపించడంలేదు. త్వరలో జరిగే హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాల్సి ఉంటుంది.






