ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మకరందు
ఉట్నూర్, ఆగస్టు 3: ప్రజావాణిలో ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు అధికారులను ఆదేశించారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల వినతులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు కేటాయించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాల లబ్ధి, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం తదితర అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు. ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖ అధికారులు బాధ్యతాయుతంగా పరిశీలించి, నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.






