4 August, 2026 | 2:48 AM

నిమ్స్‌మరిన్ని మైలురాళ్లు సాధించాలి

04-08-2026 01:33 AM
  1. నిమ్స్ వైద్య బృందానికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
  2. మూడేళ్లలో వెయ్యి రోబోటిక్ సర్జరీలు చేసిన నిమ్స్ వైద్యులు
  3.   90 శాతం సర్జరీలకు ఆరోగ్య శ్రీ, సీఎంఆర్‌ఎఫ్ పథకాల వర్తింపు

పంజాగుట్ట, ఆగస్టు 3 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నది. ఆస్పత్రి వైద్యులు మూడేళ్లలో వెయ్యి మందికి రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించడంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించినందుకు నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్‌తో పాటు వైద్య బృందం, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందానికి అభినందనలు తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పం నెరవేరిందన్నారు. రొబోటిక్ సర్జరీల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా నిర్వహించడం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయమని అన్నారు. ఇటీవలే రెండు వేల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసిన నిమ్స్, ఇప్పుడు వెయ్యి రొబోటిక్ సర్జరీల మైలురాయిని చేరుకోవటం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పిందన్నారు.

వైద్య రంగంలో నిమ్స్ మరిన్ని మైలురాళ్లు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా వైద్యులను అభినందించారు. కాగా నిమ్స్‌లో జరిగిన వెయ్యి రోబోటిక్ సర్జరీల్లో యూరాలజీ విభాగంలో 590, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 248, సర్జికల్ ఆంకాలజీలో 162 నిర్వహించారు.

2023 ఆగస్టు 7న నిమ్స్‌లో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ నిర్వహించినట్టు ఆస్పత్రి డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ వెల్లడించారు. 80 ఏళ్ల వృద్ధులకు కూడా వైద్యులు సర్జరీలు చేశారు. రాడికల్ సిస్టెక్టమీ, రాడికల్ ప్రొస్టెక్టమీలతోపాటు.. ఐదుగురికి ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలను చేశారు. వెయ్యి రోబోటిక్ సర్జరీలకు 90 శాతం ఆరోగ్య శ్రీ, సీఎంఆర్‌ఎఫ్ పథకాలు వర్తించాయని నిమ్స్ డైరెక్టర్ వెల్లడించారు.