4 August, 2026 | 2:19 AM

రేవంత్ రెడ్డిని సీఎం చేయడమే.. క్రిమినల్‌వేస్ట్

04-08-2026 01:46 AM
  1. ఖమ్మం యువకుడు వేణు సూసైడ్ లేఖ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్
  2. యువతకు ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో చర్చ జరగాలి
  3. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి) : వాస్తవానికి రాష్ట్రంలో ‘క్రిమినల్ వేస్ట్’ ఎవరైనా ఉంటే 89 కేసులతో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డేనని, అలాంటి వ్యక్తిని సీఎం చేయడమే కాంగ్రెస్ పార్టీ చేసిన ‘క్రిమినల్ వేస్ట్’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సత్తా చాటుతున్న తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను, లక్షలాది మంది యువ ఇంజినీర్లను అవమానించేలా సీఎం చేసిన వ్యాఖ్యలే కాంగ్రె స్ పార్టీ అసలు వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి పంచిన గ్యారెంటీ కార్డులు, 13 డిక్లరేషన్లు ఇచ్చి అన్ని వర్గాలను మోసం చేయడమే అసలు ‘క్రిమినల్ వేస్ట్‘ అని వ్యాఖ్యానించారు. విద్యార్థులను, యువతను అవమానించే అర్హత రేవంత్ రెడ్డికి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఆయన ఎప్పుడైనా ఒక పోటీ పరీక్ష రాశారా? కనీసం ఒక ఉద్యోగ దరఖాస్తు ఫారం నింపారా? చివరకు తన ఎన్నికల అఫిడవిట్‌ను సైతం స్వయంగా నింపగలరా? అని సవాల్ విసిరారు.

ప్రతిరోజూ గంటల తరబడి చదువుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్‘ అన డం అత్యంత అవమానకరమని అన్నారు. ఉద్యోగాల పేరుతో అసెంబ్లీలో పెట్టింది జాబ్ క్యాలెం డర్ కాదని, ‘జాబులే లేని క్యాలెండర్‘ అని ఎద్దేవా చేశారు.  సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లా డారు. 21 ఏళ్లకే చట్టసభల్లో ప్రవేశానికి అవకా శం కల్పించాలంటూ మాట్లాడుతున్న ముఖ్యమం త్రి, తెలంగాణ యువతకు యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జెన్-జీకి చెందిన యువకుడిని విద్యాశాఖ మంత్రి గా నియమిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారని గుర్తు చేస్తూ, ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ బాధ్యతలను యువకుడికి అప్పగించాలని సవాల్ విసిరారు. 21 ఏళ్ల అంశంపై అసెంబ్లీలో తీ ర్మానం చేసినా అది ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని, ప్రజల దృష్టి మళ్లించేందుకు చేసే అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నం తప్ప మరొకటి కా దని కేటీఆర్ అన్నారు.

విద్యాశాఖ మంత్రిగా రే వంత్ రెడ్డి సాధించిన విజయం అంటే 150 మం ది గురుకుల విద్యార్థుల మరణాలా? ఉద్యోగాలు అడిగిన నిరుద్యోగులకు ‘ఎండ్రిన్ తాగి చావండి‘ అనే పరిస్థితి కల్పించడమా? రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేవలం 10 వేల కొత్త ఉ ద్యోగాలకే పరిమితం కావడమా? ఏ విషయంలో ఆయన విజయవంతమయ్యారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు.

వేణు సూసైడ్ నోట్ కాంగ్రెస్‌కు ఛార్జ్‌షీట్

యువతకు, విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం కారణంగానే యువతలో తీవ్ర ఆగ్రహం, నిరాశ పెరుగుతోందని, కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇం దుకు సీఎం రేవంత్ రెడ్డి, యువత ఓట్లు అడిగిన రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని డి మాండ్ చేశారు. ఈ అం శాలన్నింటిని ప్రస్తావిస్తూ తాము ఇప్పటికే రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశామని, తెలంగాణ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయంపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ మోసాన్ని తట్టుకోలేక ఖమ్మం జిల్లాకు చెందిన నిరుద్యోగి గడ్డం వేణు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లే తన జీవితంలో ఈ దుస్థితి వచ్చిందని ఆ లేఖ లో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పేరుతో కాంగ్రెస్ పార్టీ యువతకు చే సిన వాగ్దానాలు, వాటి అమలులో జరిగిన మోసా న్ని కూడా వేణు తన లేఖలో ప్రస్తావించారని తెలిపారు.

యువత ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందవద్దని, డిప్రెషన్‌లోకి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఎవరూ బలవన్మరణాలకు పాల్పడవద్దని కోరారు. రాబోయే బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు వారి భవిష్యత్తుకు అండ గా నిలిచే విధానాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

‘పెద్ది’పై ప్రభుత్వ వేధింపులు.. ఒత్తిడి

రాష్ట్రంలో నిర్మితమైన ప్రాజెక్టులు, రోడ్లు, భవనాలు, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంట ర్, రూ.200 కోట్ల జూబ్లీహిల్స్ ప్యాలెస్ వంటి నిర్మాణాలన్నీ ఇంజనీర్ల ప్రతిభ ఫలితమేనని కేటీఆర్ గుర్తు చేశారు. అలాంటి ఇంజనీర్లనే అవమా నించిన రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇంజనీరింగ్ విద్యార్థులు ఆయనను వదిలిపెట్టరని హెచ్చరించారు.

భవనాలు నిర్మించడం మాత్రమే కాదు, తమను అవమానించిన నాయకులకు, పార్టీలకు రాజకీయంగా సమాధి కట్టడం కూడా ఇంజనీరింగ్ విద్యార్థులకు తెలుసని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా యువకుడు గడ్డం వేణు రాసిన సూసైడ్ లేఖ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై దాఖలైన ఒక ఛార్జ్ షీట్ అని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతున్న నేప థ్యంలో కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, యువతకు ఇచ్చిన హామీల అమలు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

యువతకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ వారి తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అబద్ధాలు ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ నిం డిందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అక్క డి నుంచి మిడ్ మానేరు వరకు నీరు ఎలా వ స్తోందో చెప్పాలని ప్రశ్నించారు.

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా కొందరి వ్యక్తిగత ప్రయోజ నాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంపై రుద్దుతోందని ఆరోపించారు. ప్రైవేట్ కంపెనీ అప్పులను రాష్ట్ర ప్రజలపై మోపే ప్రయత్నం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వం రాయదుర్గం నుం చి ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించే దశకు తీసుకెళ్తే, వాటిని రద్దు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డేనని విమర్శించారు.

దేశంలోని అనేక చిన్న పట్టణాలకు మెట్రో లను మంజూరు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభు  త్వం తెలంగాణ మెట్రో విస్తరణకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా అన్యాయమేనన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు బీఆర్‌ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు.

నర్సంపేటలో వ్యాపారులను సుదర్శన్ రెడ్డి పేరు చెప్పా లని పోలీసులు వేధించిన ఘటన వాస్తవమేనని చెప్పారు. సివిల్ సప్లైస్ శాఖలో జరిగిన అవినీతి, విద్యాశాఖలో బంకర్ బెడ్స్ కుంభకోణాన్ని బయటపెట్టడమే కాకుండా, ఆ ఆధారాలను ఈడీకి అం దజేసి, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాటం చేసినందుకే సుదర్శన్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. 

యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్యకు వైద్యానికి కేటీఆర్ అండ...

తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యా దిరెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరంతరం అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల అమరవీరుడు యాదిరెడ్డి తమ్ముడి కుమార్తె భవిష్యకు విజయవంతంగా మైనర్ శస్త్రచికిత్స పూర్తికావడం తో, కోలుకున్న చిన్నారి భవిష్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు సోమవారం నంది నగర్ నివాసంలో కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

చిన్నారి భవిష్యతో కేటీఆర్ ఆప్యాయంగా ముచ్చటిస్తూ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసు కున్నారు. క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి భరోసా కల్పించిన కేటీఆ ర్‌కు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మాజీ మంత్రి సబితా పాల్గొన్నారు.