సింగరేణికే పీకేఓసీ-2 కోల్ బ్లాక్
- వరుసగా మూడు బొగ్గు బావులు
- సంస్థకు దక్కినందుకు సంతోషకరం
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సమీపంలోని పీకేఓసీ-2 (ప్రకాశం గని ఓపెన్ కాస్ట్) డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం సంతోషకరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు, కార్మికుల కుటుంబ సభ్యులకు, కార్మిక సంఘాల ప్రతినిధులకు, సింగరేణి అధికారులకు, తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇటీవలే.. ఒడిశాలోని నైని కోల్ బ్లాక్, తాడిచర్ల -2 బ్లాక్ సింగరేణి సిగలో చేరిన సందర్భంలో.. పీకేవోసీ-2 డిప్ సైడ్ బ్లాక్‌ను కూడా సింగరేణికే దక్కేలా చొరవ తీసుకోవాలని కార్మికులు, యూనియన్ లీడర్ల నుంచి డిమాండ్లు వచ్చాయని గుర్తు చేశారు. పీకేవోసీ-2 డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి వచ్చే విధంగా అన్నిరకాలుగా బాధ్యత వహించి.. మంత్రిగానే కాకుండా తెలంగాణ బిడ్డగా.. సింగరేణి శ్రేయస్సు, అభివద్ధి, సింగరేణి కార్మికులను ప్రేమించే వ్యక్తిగా ప్రత్యేక కృషి ఫలితంగా సింగరేణి విజయం సాధించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు.
సోమవారం వేలం ప్రక్రియ పూర్తయిపోయిందని, సింగరేణి సంస్థకు మణుగూరు పీకేవోసీ2 డిప్‌సైడ్ బ్లాక్‌ను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ డిప్ సైడ్ బ్లాక్ వల్ల సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్లపాటు ఈ మైన్ నడుస్తుందని తెలిపారు.
దాదాపు 2 వేలకుపైగా ఉద్యోగాలొస్తాయన్నారు. ఇక్కడ దొరికే జీ-8 (మంచి క్వాలిటీ) బొగ్గు కారణంగా.. మొత్తం రూ.43వేల కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ అవుతుందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు మించి ఆదాయం కూడా లభిస్తుందని తెలిపారు. దీనివల్ల.. తెలంగాణ ఇంధన భద్రతకు భరోసా దక్కడంతోపాటు.. సింగరేణి భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన వనరులు లభిస్తాయని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
సింగరేణికి ఆర్థిక బలం
సింగరేణి బొగ్గు కంపెనీకి వరుసగా మూడు బొగ్గు బావులు దక్కడం ద్వారా.. దక్షిణ భారతదేశానికి అవసరమైనంత మేర బొగ్గును అందుబాటులోకి తెచ్చి, తెలంగాణ ప్రాంతంలో మరింత పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ కల్పనకు మేలు జరుగుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. సింగరేణి సంస్థకు.. ఆర్థిక బలం పెరిగి, సింగరేణి కార్మికులకు ఉద్యోగ భద్రత మరింతగా పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో.. 3 బొగ్గు గనులు సింగరేణి సాధించడం ఒక శుభపరిణామమన్నారు.
నైని, తాడిచర్ల-2, పీకేవోసీ-2 డిప్‌సైడ్ బ్లాక్ రావడంతో..
* సింగరేణికి 860 మిలియన్ టన్నుల రిజర్వ్స్ సమకూరుతాయి.
* 6,500 మందికి జీవనోపాధి లభిస్తుంది.
* సగటున 35 ఏళ్లపాటు ఏడాదికి 22 మిలియన్ టన్నుల చొప్పున ఉత్పత్తి చేయవచ్చు.
* ఈ 3 బ్లాక్స్ వల్ల సింగరేణికి రూ.1,95,510 కోట్లకు పైగా రెవెన్యూ వస్తుంది.
* రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపుగా రూ.48వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది.






