రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం
రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
రైతు భరోసా క్రింద ప్రతి ఎకరానికి పన్నెండు వేలు ఇస్తున్నాం*
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల 80 వేల మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు
ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశ కార్యక్రమంలో ప్యాక్స్ గోడౌన్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి, జిల్లా కలెక్టర్
కూసుమంచి,(విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం కూసుమంచి మండలంలో పర్యటించి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్ లతో కలిసి పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా వెంకటాపురం గ్రామంలో దేపంగి శ్రీకాంత్, వీరకుమారి దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం చేగొమ్మ గ్రామంలో ఒక కోటి 52 లక్షలతో నిర్మించిన 2 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోడౌన్ లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో గడిచిన రెండు సంవత్సరాల మూడు నెలల్లో అన్ని వర్గాల వారికి, రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులను రాజు చేసే కార్యక్రమంలో భాగంగా రైతుల సంక్షేమంతో పాటు వారి అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే అన్న మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మంది రైతులకు 20 వేల 670 కోట్లు రెండు లక్షల రూపాయల వరకు రుణ మాఫీ చేశామని మంత్రి తెలిపారు.
రైతు భరోసా ద్వారా ప్రతి పంటకు ఎకరానికి 6 వేల రూపాయలు చొప్పున సంవత్సరానికి 12 వేలు ఇస్తున్నామని, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాకు అదనంగా 500 రూపాయలు బోనస్ అందిస్తున్నామని, సన్న వడ్లను ఇతర ప్రాంతాలకు పంపకుండా పట్టించి పేదలకు సన్న బియ్యం అందిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి గింజను కొన్నామని, ఇకముందు కూడా కొంటామని, కొన్న వారం రోజుల్లోగా రైతుల ఖాతాల్లో ప్రజా ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్నదని తెలిపారు. రైతులు పండించిన పంట నిల్వ ఉంచాలంటే వాటికి గోదాముల అవసరమున్నదని, సొసైటీ ద్వారా వెయ్యి మెట్రిక్ టన్నుల కెపాసిటీతో రెండు గోదాములు చేగొమ్మలో నిర్మించుకొని నేడు ప్రారంభించుకున్నామని తెలిపారు.
రైతులకు భరోసాగా భూ భారతి తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 లక్షల 80 వేల మందికి కొత్త పాసు పుస్తకాలను అందజేశామని, ప్రతి అంగుళాన్ని సర్వే చేసి రైతుల పాసు పుస్తకంలో భూమి సర్వే మ్యాప్ ను ప్రింట్ చేసి భవిష్యత్ లో భూమి పంచాయతీలు రాకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లను రాబోయే కొద్ది రోజుల్లోనే ఇస్తామని, మూడు, నాలుగో విడతలలో కూడా అర్హులైన పేదవాళ్లకు ఇందిరమ్మ ఇళ్లులు ఇస్తామని తెలిపారు. ప్రతి సోమవారం కట్టిన ఇంటి లెవెల్ కు అనుగుణంగా డబ్బులు జమ చేస్తున్నామన్నారు. రైతులు, ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో బతికేలా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు, ప్రతి వర్గాన్ని ప్రభుత్వం ఆదుకుంటూ, భవిష్యత్తులో మరింత అండగా ఉంటుందని తెలిపారు.
చేగొమ్మ గ్రామస్తులు కోరిన విధంగా కొండాపురం రోడ్డును రాబోయే వర్షాకాలం లోపు పూర్తి చేయిస్తానని తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్మించుకున్న రెండు గోదాములు నేడు మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభించుకున్నందుకు సంతోషం వ్యక్తం చేసారు. 2 గోదాములు ప్రారంభించు కోవడంతో రెండు వేల మెట్రిక్ టన్నుల స్టోరేజ్ కెపాసిటీ జిల్లాలో పెరిగి, జిల్లాలో పండించిన పంటకు స్టోరేజ్ వెసలుబాటు వచ్చిందని, వేరే జిల్లాలపై ఆధారపడకుండా సీజన్ కు ముందు గోదాములు అందుబాటులోకి తీసుకొని వచ్చామని అన్నారు.
పంట కోతల ఆధారంగా ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసి, ధాన్యం కొనుగోళ్లు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, డిసిఓ గంగాధర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, కూసుమంచి మండల తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ, వివిధ గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.




