1 April, 2026 | 1:39 AM

పీరంచెరువు, స్నేహిత హిల్స్‌లో అక్రమ నిర్మాణాలకు అడ్డు ఎవరు?

01-04-2026 12:00 AM

సూత్రధారులు, పాత్రధారులు రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు

అక్రమ నిర్మాణాల్లో కలెక్షన్ కింగ్‌గా చక్రం తిప్పుతున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి

సర్కిల్ కార్యాలయంలో కనిపించని ఏసీపీ

రాజేంద్రనగర్ మార్చి 31 (విజయక్రాంతి) : రాజేంద్రనగర్ జిహెచ్‌ఎంసి సర్కిల్ పరిధిలోని ఫిబిల్ సిటీ రోడ్డు పీరం చెరువు మరియు స్నేహిత హిల్స్ కాలనీలో అక్రమ నిర్మాణాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతున్నాయి. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్న సమయంలో భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకున్న బిల్డర్లు ఏమాత్రం జంకు బొంకు  లేకుండా పెద్ద ఎత్తున అక్రమ భవనాలను నిర్మిస్తున్నారు అనుమతులు తీసుకున్న దానికంటే అక్రమంగా భారీ భవనాలను నిర్మిస్తున్న యజమానుల దగ్గర పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన రాజేంద్రనగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వారికి సూత్రధారులు పాత్రధారు లుగా నిలుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

భారీ భవనాల చుట్టూ పరదాలు కట్టుకుని పని చేసుకోవాలని. భవనా లు నిర్మాణం పూర్తయిన వాటికి వెంటనే పెయిం టింగ్ వేసుకొని భవనం ఇంటీరియర్ పనులు చేయించు కోవాలని శుద్ధ పూస సలహాలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. అక్రమ నిర్మాణాల యాజమానుల దగ్గర కలెక్షన్లు చేసేందుకు గతం నుండే  ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగిని నియమించుకొని అతని నుండి అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులు పంపి వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం పరిధిలో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రమే యం పట్ల ఇప్పటికే ఎసిబి అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఏసీపీగా విధులు నిర్వహించే అధికారి విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని తెలుస్తుంది . ఇటీవల కొన్ని జిహెచ్‌ఎంసి సర్కిల్ కార్యాల యాల్లో భవన నిర్మాణాల ఫైళ్లను ఏసీబీ తనిఖీ చేసేందుకు వచ్చిన సమయంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్లో పని చేసే సిబ్బంది సెలవు పెట్టి విధులకు హాజరు కాకపోవడం విశేషం..

ఫోన్‌లో స్పందించని ఏసీపీ శ్రీధర్

రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ శ్రీధర్ విధులకు సరిగా హాజరు కావడంలేదని.. అవినీతి ఆరోపణలపై వివరణ కోరేందుకు ఫోన్ చెయ్యగా ఆయన ఫోన్ లో స్పందించలేదు.