12 June, 2026 | 1:22 AM

డంపింగ్ యార్డ్‌గా ‘పార్కు’

12-06-2026 12:00 AM
  1. వనస్థలిపురం ఫేజ్--1 కాలనీలో నిరుపయోగంగా ఉన్న పార్కు 
  2. పార్కులో పచ్చదనం పెంచాలని స్థానికుల వినతి 
  3. స్పందించని ఎమ్మెల్యే, జీహెచ్‌ఎంసీ అధికారులు 
  4. ఏండ్ల తరబడి పోరాడుతున్న చైతన్య మహిళా మండలి

ఎల్బీనగర్, జూన్ 11 : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా వనస్థలిపురం మారిం ది. గ్రేటర్ హైదరాబాద్‌లో అత్యధిక పార్కు లు ఉన్న నియోజకవర్గంగా ఎల్బీనగర్ కు  పేరు ఉన్నది. అందులో వనస్థలిపురంలోనే అధికంగా పార్కులు ఉన్నాయి. అప్పట్లో ప్ర తి వీధికి పార్కు, కమ్యూనిటీ హాలును నిర్మించారు. కానీ, ఇప్పుడు క్షేత్రస్థాయిలో అనేక పార్కులు డంపింగ్ యార్డులుగా మారాయి.

పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక నిధులు మంజూరు చేస్తున్నా.... అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. ఇందుకు  వనస్థలిపురం ఫేజ్--1 కాలనీలో శివాలయం దగ్గర ఉన్న పార్కు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడి పార్కు నిరుపయోగంగా మారి, వ్యర్థాలను నిల్వ చేసే డంపింగ్ యా ర్డుగా మారింది.

1977లో కాలనీ ఏర్పడినప్పుడు ఏర్పాటు చేసిన పార్కు ఇప్పుడు అనాథగా మారింది. వనస్థలిపురం డివిజన్ లోని పలు పార్కుల అభివృద్ధికి నిధులు మంజూరైనా ఇక్కడి పార్కు నిర్వాహణకు ఒక్క రూ పాయి కేటాయించ లేదు. ఫలితంగా దశాబ్దాల పాటు వనస్థలిపురం ఫేజ్ -- 1 పార్కు నిరుపయోగంగా ఉన్నది. 

లక్ష రూపాయల ప్రజాధనం వృథా.. 

మొదట్లో పార్కు అభివృద్ధికి అనేక నిధు లు మంజూరు చేసి, అభివృద్ధి చేశారు. అప్ప టి ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కోటాలో వచ్చిన నిధులతో 2000లో శివాలయం దగ్గర పార్కును అభివృద్ధి చేసి, చైతన్య మ హిళా మండలి పేరుతో ప్రత్యేకంగా కమ్యూనిటీ హాలు, గ్రంథాలయం కోసం ఉమ్మడిగా ప్రత్యేక భవనం నిర్మించారు.

కాగా, స్థానిక మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ కోసం 2012లో అప్పటి వనస్థలిపురం కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, హైదరాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ రామ్మోహన్ ప్రత్యేక కృషితో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో మహిళలు చదువుకోవడానికి గ్రంథాలయం తో పాటు ఉపాధి కల్పించడానికి కుట్టు, అల్లికలకు శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక భవనం నిర్మించారు.  ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ పా ర్కు ఇప్పుడు అనాథ మారి డంపింగ్ యార్డుగా మారింది. 

పార్కులో కనిపించని పచ్చదనం.. 

పార్కులో పచ్చదనం పెంచి, వాకింగ్ ట్రా క్ ఏర్పాటు చేసి, మహిళల కోసం నిర్మించిన భవనాన్ని వినియోగంలోకి తేవాలని చైతన్య మహిళా మండలి సభ్యులు అధికారులు, ప్రజాప్రతినిధుల చూట్టు తిరుగుతున్నారు. 2000లో ఏర్పాటు చేసిన పార్కులో ఎక్కడా పచ్చదనం కనిపించదు.

వనస్థలిపురం డివిజన్‌లో అనేక పార్కులు పచ్చ దనంతో కళకళలాడుతుండగా వనస్థలిపురం ఫేజ్ - శివాలయం దగ్గర ఉన్న పార్కు ఎడారిగా మారింది. కేవలం పార్కులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. లక్షల రూపాయలతో నిర్మించిన చైతన్య మహిళా మండలి భవనం వృథాగా మారింది. మహిళల కోసం ఏర్పా టు చేసిన కుట్టుమిషన్లు పనికి రాకుండా ఉన్నాయి.

పచ్చదనం పెంచి, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి.. 

వనస్థలిపురం ఫేజ్--1లోని చైతన్య మహిళా మండలి పార్కులో పచ్చదనం పెంచి, వృద్ధుల కోసం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి. ఇందు కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేకు అనేక సార్లు వినతి పత్రం అందజేశాం. తమ సమీపంలో ఉన్న అనేక పార్కులను అభివృద్ధి చేస్తున్నా... వనస్థలిపురం ఫేజ్ -1 లో ఉన్న పార్కును అభివృద్ధి చేయడం లేదు.

ఇందు కోసం జీహెచ్‌ఎంసీ అధికారులు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి వినతి పత్రం అందజేశాం. కానీ, ఎవరూ స్పందించడం లేదు. వనస్థలిపురం ఫేజ్ -1 లో ఉన్న పార్కు ఇప్పుడు డంపింగ్ యార్డ్ గా మారింది. దేవాలయ నిర్మాణ వ్యర్థాలను డంప్ చేయడానికి పార్కును వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ఎమ్మెల్యే స్పందించి పార్కును అభివృద్ధి చేయాలి.

ఆశాజ్యోతి, చైతన్య మహిళా మండలి అధ్యక్షురాలు