మీనాక్షికి వెన్నుపోటు
- ఆమె నామినేషన్ తిరస్కరణ వెనక సీఎం సన్నిహితుడు!
- రైతులు, విద్యార్థులకు నిధులు లేవంటున్న ప్రభుత్వం
- సీఎం వంద కోట్ల రూపాయల గెస్ట్ హౌస్‌కు, హెలికాప్టర్‌లో షికార్లకు డబ్బులెక్కడివి?
- అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యూచర్‌సిటీని రద్దు చేస్తాం
- మీడియా చిట్‌చాట్‌లో మాజీమంత్రి హరీశ్ రావు
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిశారని, ఆమె నామినేషన్ తిరస్కరణ వెనుక సొంత పార్టీ నేతల కుట్రే ఉందని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ నామినేషన్ తప్పుల గురించి లీకులు ఇచ్చింది ఎవరో రేవంత్‌రెడ్డి వెంటనే తేల్చాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశించిన, సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తే ఈ వెన్నుపోటుకు పాల్పడినట్లు ‘మాకు పక్కా సమాచారం ఉంది’ అని అన్నారు.
రైతులు, విద్యార్థులకు నిధులు లేవంటున్న ప్రభుత్వానికి సీఎం వంద కోట్ల గెస్ట్ హౌస్‌కు, నెలకు రూ.5 కోట్ల హెలికాప్టర్ షికార్లకు డబ్బులెక్కడివని ప్రశ్నించారు. విద్యాశాఖలో గుజరాత్ కాంట్రాక్టర్ల పేరుతో రూ.2 వేల కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన మధ్యప్రదేశ్ మంత్రి సైతం.. మీనాక్షి నటరాజన్ ఉన్న కేసుల సమాచారం తెలంగాణ కాంగ్రెస్ నుంచే వచ్చిందని కుం డబద్దలు కొట్టారన్నారు. సొంత పార్టీ ఇంచార్జికే వెన్నుపోటు పొడిచే నాయకులు, ఇక సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తారన్నారు. ఈ నామినేషన్ తిరస్కరణ కుట్రపై రేవంత్‌రెడ్డి సిట్ విచార ణ వేస్తాడా...లేక ఇంకేదైనా విచారణ వేస్తాడా.. ఏదో ఒకటి చేసి అసలు ఏం జరిగిందో నిగ్గు తేల్చాలన్నారు.
కేసీఆర్ అత్యద్భుతమైన సెక్రటేరియట్ నిర్మిస్తే, అక్కడికి వెళ్లని రేవంత్‌రెడ్డి.. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ లో మరో క్యాంపు కార్యాలయం కట్టుకుంటున్నారని, చదువు చారెడు.. బలపాలు దోసెడు అన్న ట్లుగా ఉంది ముఖ్యమంత్రి తీరని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్‌లో తన నివాసానికి కొద్ది దూరంలోనే ఏకంగా రూ.100 కోట్లతో బోధి పెవిలియన్ పేరుతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారని, అర్ధరాత్రి పూట సతీసమేతంగా వెళ్లి అక్కడి పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఈ గెస్ట్ హౌస్ కోసం మొదట వీవీఐపీ గెస్ట్ హౌస్ పేరుతో కేవలం రూ.7 కోట్లతో జీవో ఇచ్చి, ఇప్పుడు దాన్ని రూ.100 కోట్లకు పెంచారన్నారు. ఆ గెస్ట్ హౌస్ చుట్టూ రూ.17 కోట్లతో ఇ నుప కంచెలు, ఫుట్ బాల్ ఆడుకోవడానికి రూ.10 కోట్లతో స్టేడియం నిర్మిస్తూ ముఖ్యమంత్రి సోకులు పడుతున్నారన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో తన సొంతానికి మూడో క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నారని తెలిపారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడానికి, రైతులకు సాయం చేయడానికి ఖజానాలో డబ్బు లు లేవంటున్న ప్రభుత్వానికి.. వందల కోట్లతో గెస్ట్ హౌస్‌లు కట్టుకోవడానికి మాత్రం నిధులు ఎక్కడివని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి, ఉద్యోగుల జీతాలకు, రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవా? అని ప్రశ్నించారు.
కొత్త హెలికాప్టర్‌లో సీఎం షికారు
మొన్నటివరకు నెలకు రూ.2 కోట్ల అద్దెతో తిరిగిన హెలికాప్టర్ స్థానంలో, ఇప్పుడు నెలకు ఏకం గా రూ.5 కోట్లు వెచ్చించి, మరీ కొత్త హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి షికార్లు చేస్తున్నారని విమ ర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేసిందని, అయితే గతంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల కాంగ్రెస్ అనుయాయులు భారీగా భూములు కొనుక్కున్నారని, ఇప్పుడు వారికి మేలు చేసేందుకు ఆ ఔటర్ లోపల ఉన్న 111 జీవోను కూడా ఎత్తివేసేలా సెక్రటేరియట్‌లో పెద్ద ఎత్తున ఫైళ్లు నడుపుతున్నారని ఆరోపించారు.
స్కూళ్లు వాయిదా వెనుక రూ.2వేల కోట్ల కుంభకోణం
ఏటా జూన్ 12వ తేదీన తెరుచుకోవాల్సిన పాఠశాలలను 15వ తేదీకి ఎందుకు వాయిదా వేశారని, దీని వెనుక ఏకంగా రూ.2 వేల కోట్ల భారీ కుంభకోణం దాగి ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టులు సెట్ కాకపోవడం వల్లే బడుల ప్రారంభాన్ని వాయిదా వేశారన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గురుకులాలు, ప్రభుత్వ బడుల్లో యూనిఫామ్స్ కుట్టే బాధ్యత చేనేత కార్మికులకు.. షూ, బెల్టుల తయారీ దళిత కుటుంబాలు బతకాలని లిడ్‌క్యాప్‌కు ఇచ్చామన్నారు.
కానీ రేవంత్‌రెడ్డి వాటిని సెంట్రలైజ్ చేసి, మన వాళ్ల పొట్టగొట్టి గుజరాత్ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాడన్నారు. ఆ గుజరాత్ కాంట్రాక్టర్ నుంచి ఇంతవరకు బట్టలు రాలేదని, 7 లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఇవ్వాల్సిన బ్యాగు లు, డ్రెస్సులు, బెల్టులు, నోట్ బుక్స్ ఏవీ ఇంకా అందలేదన్నారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం వల్లే విద్యావ్యవస్థ ఇంత అస్త వ్యస్తంగా మారిందని విమర్శించారు. బడుల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అసలు అములే కావడం లేదన్నారు.
అమ్మఒడి కమిటీల ద్వారా పనులు చేసిన మహిళా సంఘాలకు, పేదలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.4 కోట్ల చొప్పున బిల్లులు పెండింగ్ పెట్టారని, స్కావెంజర్లకు సైతం నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు పరీక్షా ఫీజులు ఫ్రీ అని నమ్మబలికి.. తీరా గెలిచాక పెంచేశారని పేర్కొ న్నారు.
రేవంత్‌రెడ్డి అనేక సందర్భాల్లో బీఆర్‌ఎస్ గురించి పదేపదే మాట్లాడుతున్నాడని, తాము నిజంగానే ‘చెల్లని నోటు’ అయితే, నిద్రలో కూడా మమ్ములను ఎందుకు కలవరిస్తున్నాడు? మరి సీపీఐ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.
భూముల ధరలతో ఇబ్బందులు
అడ్డగోలుగా పెంచిన భూముల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. ఈ ప్రభుత్వ విధా నాలతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని, ఇతర రాష్ట్రాల్లో కొన్ని ఎస్‌ఎఫ్‌టీల వరకు తక్కువ ధరలు నిర్ణయిస్తే, ఇక్కడ మాత్రం ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారన్నారు. ఆర్టీఏ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, మద్యం ధరలు ఇప్పటికే పెంచారు, మళ్లీ ఇప్పుడు మందుల ధరలు కూడా పెంచబోతున్నారన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెట్రోల్ ధరలు తగ్గించాలని ఊరికే డిమాండ్ చేసిన నాయకుడు, అనేక రాష్ట్రాలు తగ్గించినట్లుగా ఇక్కడ స్టేట్ ట్యాక్స్ తగ్గించాలన్నారు. ఎలాంటి న్యాయపరమైన వివాదాలు లేని భూములను జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఇవ్వాలన్నారు. ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇస్తామంటే తామేమీ వ్యతిరేకించడం లేదని, కానీ అక్కడ ఇప్పటికే కొందరు రైతు లు కేసులు వేశారన్నారు.
ఫ్యూచర్ సిటీ జాన్‌తానై..
ఫ్యూచర్ సిటీ అని గొప్పలు చెబుతున్న ఆ ప్రాజెక్టు.. ఇప్పుడు అక్కడి చుట్టుపక్కల గ్రామాలకు ఓ శాపం కాబోతోందని మాజీ మంత్రి హరీ శ్‌రావు వివరించారు. హెచ్‌ఎండీఏ ద్వారా అప్పులు తేవడమే కాకుండా, రెగ్యులర్ ట్యాక్స్‌తో పాటు కొత్తగా టోల్ గేట్లు పెట్టి మరీ ‘అడిషనల్ ఇంపాక్ట్ ఫీజు పేరుతో’ ప్రజల జేబులు గుల్ల చేయబోతున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి వేల కోట్ల అప్పు లు తేవడానికి ఈ ప్రభుత్వం ఏకంగా దళారులను పెట్టుకుందన్నారు.
అప్పులు ఇప్పించినందుకు ఆ బ్రోకర్లకు వందల కోట్లు కమీషన్లుగా దోచిపెడుతు న్నారని, మన రాష్ట్రం కమీషన్లు ముట్టజెప్పగానే.. ముంబైకి చెందిన ఆ బ్రోకర్ ఏకంగా ఓ విమానమే కొనుక్కున్నాడని ఆరోపించారు. మళ్లీమళ్లీ స్పష్టంగా చెబుతున్నామని, తాము అధికారంలోకి రాగానే ఈ ఫ్యూచర్ సిటీని కచ్చితంగా రద్దు చేస్తామన్నారు. ఫార్మాసిటీలో పెట్టుబడులు పెడదామని ఎంతోకాలంగా ఎదురుచూసిన కంపెనీలు, ఈ ప్రభుత్వ తీరుతో విసిగిపోయి చివరకు ఆంధ్రప్రదేశ్ నెల్లూరులోని శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టాయన్నారు.
ఫార్మాసిటీ కోసం తన సొంత భూమి 17 ఎకరాలు ఇచ్చానని, ఆ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనన్నారు. ఫార్మాసిటీ వస్తే రాష్ట్రానికి భారీగా ఆదాయం వచ్చేదన్నారు. కానీ రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రం ఆదాయం కోల్పోవడంతో పాటు, ఇక్కడి పిల్లలకు ఉద్యోగాలు రాకుండా పోయాయన్నారు.






