31 March, 2026 | 10:50 PM

కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్‌పై మంత్రి జూపల్లి ఆగ్రహం

31-03-2026 09:19 PM

కొల్లాపూర్ టౌన్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 2026–2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశం మంగళవారం కొల్లాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. బడ్జెట్ వివరాలపై మంత్రి ఆరా తీస్తూ మున్సిపాలిటీలో జరిగిన ఖర్చుల గురించి ప్రశ్నించారు. మున్సిపల్ అనుమతి లేకుండా సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేయడంపై మంత్రి జూపల్లి కృష్ణారావు మున్సిపల్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా ఎన్నికల అధికారితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, అనుమతి లేకుండా మున్సిపల్ నిధులు వినియోగించరాదని అధికారికి సూచించారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే సహించబోమని హెచ్చరించారు. మున్సిపాలిటీలో ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉండటంతో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఆదాయం కూడా సక్రమంగా వినియోగించబడకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని చెప్పారు. ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా అందరూ సమన్వయంతో పని చేయాలని కౌన్సిలర్లకు సూచించారు.

కొల్లాపూర్‌ను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలో మొత్తం 19 మంది కౌన్సిలర్లు ఉండగా, బడ్జెట్ సమావేశానికి ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. తొలిసారి బడ్జెట్ సమావేశానికి వచ్చిన కౌన్సిలర్లను మంత్రి జూపల్లి కృష్ణారావు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ షేక్ రహీం భాషా, గుండ్రోతి స్వప్న, కిరణ్ తేజ గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.