విద్యార్థుల నమోదు పెంపునకు ఇంటింటి ప్రచారం
బెజ్జంకి, జూన్ 11: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని చీలాపూర్ గ్రామంలో ప్రజా జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడం, నాణ్యమైన విద్యపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు రామంచ రవి ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, ఆంగ్ల మాధ్యమ బోధన, డిజిటల్ తరగతులు, పాఠశాలలో మెరుగైన మౌలిక వసతుల గురించి తల్లిదండ్రులకు వివరించారు.
ప్రీ ప్రైమరీ నర్సరీ ఎల్కేజీ ఇంగ్లీష్ మీడియం క్లాసులు ప్రారంభించడం జరిగిందనీ తెలిపారు. ప్రతి చిన్నారి విద్య హక్కును వినియోగించుకునేలా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం మెట్ల తిరుమలేష్ , ఉపాధ్యాయులు గ్రామ విద్యా కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.






