12 June, 2026 | 1:23 AM

‘సర్’పై విపక్షాలది దుష్ప్రచారం

12-06-2026 12:00 AM
  1. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి  
  2. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కొత్తేమీ కాదు
  3. అర్హులైన ఓటర్లకు ఎలాంటి నష్టం జరగదు
  4. ఓటర్లుగా నమోదు కావడానికి రోహింగ్యాల ప్రయత్నం 
  5. ప్రజాస్వామ్య వ్యవస్థలను బీజేపీ గౌరవిస్తుంది
  6. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

గజ్వేల్/కొండపాక, జూన్ 11: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం సరికాదన్నారు.

సిద్దిపేట జిల్లా మాత్‌పల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో బీజేపీ బూత్ లెవల్ స్థాయి నాయకులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు గురువారం ఆయన హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 1952 నుంచి దేశవ్యాప్తంగా పలుమార్లు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేశాయని, ఇది కొత్తేమీ కాదన్నారు. మృతిచెందిన, ఇతర ప్రాంతాలకు మారినవారి పేర్లు, నకిలీ, డబుల్ ఓట్లను జాబితా నుంచి తొలగించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు.

అర్హులైన భారతీయ పౌరుల ఓటు హక్కును పరిరక్షించేందుకు ఓటరు జాబితా ప్రక్షాళన అవసరమని పేర్కొన్నారు. సర్ పేరుతో ఓట్ల తొలగింపునకు బీజేపీ కుట్ర చేస్తుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు. నిజమైన ఓటర్లకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలు ఓటర్లుగా నమోదు కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు ఉన్నాయన్నారు. 

బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ ‘సర్’

పశ్చిమబంగాల్, కర్ణాటక, కేరళం, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేసిందని, అక్కడ బీజేపీ అధికారంలో లేదన్న విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించాలన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగమే నిర్వహిస్తుండగా బీజేపీపై ఆరోపణలు చేయడం రాజకీయ దివాళాకోరుతనమని విమర్శించారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఎన్నికల వ్యవస్థపై ద్వందవైఖరి అవలంభిస్తున్నాయని.. గెలిచినప్పుడు ప్రశంసించి ఓడినప్పుడు ఆరోపణలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని వివరించారు. జనసంఘ్ కాలం నుంచే బీజేపీ ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవిస్తుందని, ఎన్నికల ప్రక్రియను ఎప్పుడూ వ్యతిరేకించలేదని తెలిపారు. ఆస్తులు, భూములు, సంక్షేమ పథకాలకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎలాంటి సంబంధం లేదని, ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నాలను కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు మానుకోవాలని హితవు పలికారు.

అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని పయత్నిస్తున్నాయని ఆరోపించారు. జమిలి ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి అంశాలపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల వైఖరి ప్రజలకు తెలిసిపోయిందన్నారు. తెలంగాణ బిల్లుపై మాట్లాడే నైతిక హక్కు  ఆ పార్టీలకు లేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నాయని విమర్శించారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, రైతులకు అప్పుల భారం మాత్రమే మిగిలిందని ఆరోపించారు.

రాజకీయ కోణంలో చూడొద్దు : ఎంపీ రఘునందన్‌రావు

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రతి చర్యకు బీజేపీ మద్దతుగా నిలుస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఓటర్ల జాబితాల ప్రక్షాళనను రాజకీయ కోణంలో చూడొద్దని, ఎన్నికల వ్యవస్థపై విశ్వసనీయతను పెంచే చర్యగా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాలేష్ గౌడ్ పాటు వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.