12 June, 2026 | 1:23 AM

‘కోల్ గ్యాసిఫికేషన్’ అడ్డా హైదరాబాద్

12-06-2026 12:10 AM
  1. సంబంధిత ఉత్పత్తులకు అత్యుత్తమ మార్కెట్
  2. దేశ ఆర్థిక రంగంలోనూ నిర్మాణాత్మక పాత్ర   
  3. మెగా గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల స్థాపనలో కీలకం
  4. కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  5. పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి సతీశ్‌చంద్ర దూబే

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): కోల్ గ్యాసిఫికేషన్ ఉత్పత్తులకు హైదరాబాద్ అత్యత్తమ మార్కెట్‌గా ఎదుగుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ రెండవ రోడ్ షో హైదరాబాద్‌లో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కోల్ గ్యాసిఫికేషన్ రోడ్ షోలో కేంద్ర సహాయ మంత్రి సతీశ్‌చంద్ర దూబేతో కలిసి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోల్ గ్యాసిఫికేషన్ ప్రయాణానికి హైదరాబాద్ మూలాధారమని చెప్పొచ్చన్నారు. ఒకప్పుడు భారత్‌లో బూడిద శాతం ఎక్కువగా ఉన్న బొగ్గుతో గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయం ఉండేదన్నారు. కానీ, హైదరాబా ద్‌లోని మన శాస్త్రవేత్తలు ఇక్కడ లభ్యమయ్యే బొగ్గును గ్యాసిఫికేషన్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.

తెలంగాణలో సింగరేణి వద్ద అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, కోల్ గ్యాసిఫికేషన్‌ను ప్రోత్సహించేందుకు దాదాపు రూ. 46,000 కోట్ల భారీ పథకాన్ని ప్రకటించిందన్నారు. దేశవ్యాప్తంగా మెగా గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల స్థాపనలో ఈ స్కీం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. 

అనేక ప్రయోజనాలు

కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఫర్టిలైజర్లు, కెమికల్స్, హైడ్రోజన్, శుద్ధమైన ఇంధనం ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని,  స్టీలు ఉత్పత్తిలో కూడా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సింథటిక్ నేచురల్ గ్యాస్.. డొమెస్టిక్, పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతుందని, డీజిల్, పెట్రోల్, జెట్ ఫుయెల్ వంటి వాటి ఉత్పత్తిలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ కీలకమన్నారు. కోల్  గ్యాసిఫికేషన్ ద్వారా విదేశీ  మారకద్రవ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు.

2014లో 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్..  ఇవాళ 4 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని, త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతోందన్నారు. ఒకప్పుడు బొగ్గు రంగానికి సంబంధిం చిన వార్తలు కుంభకోణాలు, అక్రమ కేటాయింపులకు సంబంధించి వార్తలను చూసేవాళ్లమ ని, దశాబ్దాలుగా అవినీతి, లీకేజీలు, అనుమతుల్లో జాప్యం కారణంగా పెట్టుబడులు రావ డం కష్టసాధ్యంగా ఉండేదన్నారు.

కానీ, సాంకేతిక ఆధారిత పరిపాలన, పారదర్శకంగా  వేలం ప్రక్రియ, డైరెక్ట్ బెనెఫిట్ ట్రాన్స్ ఫర్, ఆధార్  ఆధారిత గుర్తింపు ద్వారా వేలం ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా, బాధ్యతాయుతంగా మారిందన్నారు. ఈ సంస్కరణల వల్ల లీకేజీలు, నకిలీ లబ్ధిదారులను తొలగించడం ద్వారా రూ.4.3 లక్షల కోట్లకు పైగా దేశ సంపదను కాపాడగలిగామని చెప్పారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విద్యుత్, డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో భారత్ అద్భుతమైన విజయాలు సాధించిందని చెప్పారు.

ఇన్ స్టాల్ రెన్యూవబుల్ ఎనర్జీలో ప్రపంచంలో భారత్ మూడో స్థానం లో ఉందని, సౌర విద్యుత్ వృద్ధిలో భారత్  రెండో స్థానోం స్థానంలో ఉందన్నారు. భారత్ స్టార్టప్ వ్యవస్థ మూడో అతిపెద్దదిగా ఎదిగిందని, దేశంలో 1.6 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్లు, 100కు పైగా యూనికార్న్‌లు ఉన్నాయన్నారు. 

ప్రపంచ దేశాల పరిశ్రమలు భారత్‌ను ఒక పెద్ద మార్కెట్‌గానే కాకుండా, అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి పెట్టేందుకు నమ్మకమైన దేశంగా భావిస్తున్నాయని చెప్పారు. కోల్ గ్యాసిఫికేషన్ అనేది కేవలం బొగ్గు రంగానికి సంబంధించింది మాత్రమే కాదని..   వికసిత భారత్, ఆత్మ నిర్భర్ భారత్, అంతర్జాతీయంగా ఉత్పత్తి, పారిశ్రామిక  రంగాల్లో భారత్ మహోన్నత స్థాయికి ఎదిగేందుకు అవసరమయ్యే మూలస్తంభం అన్నారు