22 May, 2026 | 4:00 AM

ధాన్యం కొనుగోలు నిర్లక్ష్యంపై కలెక్టర్ సీరియస్

22-05-2026 01:47 AM
  1. డి.సి.ఓ, హత్నూర ఎంపీడీవో, ఏపీఎంలకు షోకాజ్ నోటీసులు జారీ
  2. కొనుగోళ్లలో నిర్లక్ష్యం సహించం కలెక్టర్ ప్రతీక్ జైన్

హత్నూర(సంగారెడ్డి), మే 21: హత్నూర మండలంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో చోటుచేసుకున్న నిర్లక్ష్యం, సమన్వయ లోపాలు, పర్యవేక్షణలో వైఫల్యాలపై జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జిల్లా సహకార అధికారి  కిరణ్ కుమార్, హత్నూర ఎంపీడీవో బి.శంకర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్  రాజశేఖర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హత్నూర మండలంలో ధాన్యం కొనుగోలు కార్యకలాపాలు సంతృప్తికరంగా నిర్వహించబడటం లేదని  గుర్తించామని, కొనుగోలు కేంద్రాల వద్ద పర్యవేక్షణ, మానిటరింగ్, సమన్వయంలో తీవ్ర లోపాలు ఉన్నట్లు వెల్లడైందన్నారు.

ఈ విషయమై పలుమార్లు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని  పేర్కొన్నారు. ఫీల్ స్థాయిలో సమర్థవంతమైన పర్యవేక్షణ లేకపోవడం, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యాలు చోటుచేసుకోవడం, సంబంధిత శాఖలు, ఏజెన్సీల మధ్య సమన్వయం లోపించడం వల్ల కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరుగుతున్నట్లు గుర్తించామన్నారు,రైతులకు ఎటు వంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సంబం ధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, మూడు రోజుల లోగా తమ వివరణ సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.