22 May, 2026 | 4:00 AM

ఆక్రమణల తొలగింపునకు అధికారుల కసరత్తు

22-05-2026 01:48 AM

మూడు రోజుల గడువు ఇచ్చిన మున్సిపల్ అధికారులు

కల్వకుర్తి మే 21 : జాతీయ రహదారి అనుసరించి అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలను తొలగించేందుకు మున్సిపల్ శాఖ ఏర్పాటు చేస్తుంది. జాతీయ రహదారి గుండా 100 ఫీట్ల లోపు ఉన్న ఎలాంటి అక్రమ కట్టడాలనైనా తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

పట్టణంలోని జాతీయ రహదారి ఇరువైపులా ఆక్రమణలు చేసి కొందరు వ్యాపారాలు నిర్వహించడం వల్ల రహదారి ఇరుకుగా మారడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జాతీయ రహదారి అధికారులతో కలిసి మున్సిపల్ అధికారులు ఆక్రమణల తొలగింపుపై దృష్టి సారించారు.

ఈ మేరకు ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తున్న అధికారులు మూడు రోజుల గడువు ఇచ్చారు. ఈలోగా స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని, లేని పక్షంలో మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించి, అయ్యే ఖర్చును సంబంధిత యజమానుల నుంచే వసూలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ షేక్ మహమూద్ తెలిపారు.

కల్వకుర్తి పట్టణం మీదుగా సుమారు నాలుగు కిలోమీటర్ల మేర జాతీయ రహదారి విస్తరించి ఉంది. అధికారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి కొందరు తమ వ్యాపా రాలకు అనుగుణంగా షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో రహదారి విస్తరణ, ట్రాఫిక్ సౌలభ్యం మరియు ప్రజల భద్రత దృష్ట్యా ఆక్రమణలను పూర్తిగా తొలగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రధానంగా మహబూబ్నగర్ చౌరస్తా నుండి హైదరాబాద్ చౌరస్తా వరకు బారికేడ్లు తొలగించి డ్రైనేజీ కాల్వపై నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు చేస్తున్నారు. అట్టి వారిపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిఉంది.