20 May, 2026 | 2:46 AM

ఆలయాల బంగారంపై గోల్డ్ బాండ్లు అవాస్తవం

20-05-2026 01:49 AM

కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ

న్యూఢిల్లీ, మే ౧౯: దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల పరిధిలో అమలవుతున్న బంగారం నిల్వల విధానం రద్దు కాబోతున్నదని, ఆ స్థానంలో గోల్డ్ బాండ్ల పద్ధతి తీసుకువచ్చే యోచనలో కేంద్రం ఉందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టతనిచ్చింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వార్తలను వదంతుల్లానే చూడాలని సూచించింది. బంగారం నిల్వలపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కుండబద్దలు కొట్టింది.

ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన సమాచారాన్ని, పౌరులు కేవలం అధికారిక వెబ్‌సైట్లు, ఛానళ్లను చూసే ఒక నిర్ణయానికి రావాలని హితవు పలికింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని కేంద్రం 6 శాతం నుంచి 15 శాతానికి పెంచిన నేపథ్యంలోనే గోల్డ్ బాండ్ల అంశం తెరమీదకు వచ్చిందని, ఈ నేపథ్యంలోనే సోషల్‌మీడియాలో కొన్ని అసత్య వార్తలు ప్రచారంలో ఉన్నాయని ప్రకటించింది.