3 March, 2026 | 3:39 AM

రాష్ట్రంలో గడ్డపార రాజ్యం

03-03-2026 01:19 AM
  1. కూల్చివేతలే పని 
  2. రాహుల్‌కు రాష్ట్రానికి వచ్చే నైతిక అర్హత లేదు 
  3. పెన్షనర్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి 
  4. పెన్షనర్ల ధర్నాలో బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు

హైదరాబాద్/ముషీరాబాద్, మార్చి 2 (విజయక్రాంతి): రాష్ట్రం గడ్డపార రాజ్యంగా మారిపోయిందని, సీఎం రేవంత్‌రెడ్డి చేతుల్లో గడ్డపార.. మంత్రుల చేతుల్లో పారలు పేదల ఇండ్లను కూలగొట్టే పనిలో ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది ఏమీలేదని, అంతా కూల్చివేతలేనన్నారు. రాహుల్‌గాంధీకి తెలంగాణకు వచ్చే నైతిక అర్హత లేదన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు అమలు చేయకుండా ఆయన ఎలా వస్తారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కుటుంబానికి రూ. వెయ్యి కోట్లు ఇస్తారు.. ఉద్యోగులకు మాత్రం ఇచ్చేందుకు కనీసం రూ. వెయ్యి కూడా ఉండని పరిస్థితి అని ఆరోపించారు. ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వం నడవదని, వెంటనే పెన్షనర్ల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్- ధర్నా చౌక్ వద్ద రాంచందర్‌రావు అధ్యక్షతన పెన్షనర్లకు మద్దతుగా బీజేపీ ధర్నా నిర్వహించింది.

ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్ అనంతరం ప్రశాంతంగా జీవించాల్సిన వయసులో, తమ జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న బకాయిల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు ఇలా అవమానాలు ఎదుర్కోవడం కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు నమోదయ్యాయని, కొందరు ఆర్థిక ఒత్తిడిని తట్టుకో లేక ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారన్నారు.

మరికొందరు సరైన వైద్యం చేయిం చుకోలేక ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, రేవంత్ సర్కారు నిర్లక్ష్యం ఉద్యోగుల జీవితాలను బలి తీసుకుంటోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశాల న్నింటిపైన తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్న రోజుల్లో అసెంబ్లీలో, మండ లి లో బలంగా మాట్లాడతారని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులు, యువత, మహిళలు, నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు సహా అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించారని రాంచందర్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పేదల మీద, ఉద్యోగుల మీద, రైతుల మీద జరుగుతున్న ఈ దారుణమైన అణచివేతకు ఇక ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్నారు.

ప్రజల హక్కులను కాలరాస్తూ, బలవంతపు కూల్చివేత లతో భయాందోళన సృష్టిస్తున్న ఈ కాంగ్రెస్ గడ్డపార రాజ్యాన్ని కూలగొట్టాల్సిందేనని, తెలంగాణ ప్రజలు ఇక మౌనంగా ఉండరన్నారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో నివసిస్తున్న దాదాపు 600 మంది పేదల ఇండ్లను కూడా కూల్చివేశారన్నారు.

హెల్త్ స్కీమ్ అమలు చేసే పరిస్థితి ఉందా..?

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయి లు వేల కోట్ల రూపాయలకు చేరాయని, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో రోగుల ప్రాణాలతో ఆడుకుంటోం దని, సమయానికి రిటైర్డ్ బెనిఫిట్స్ కూడా రావడం లేదన్నారు. రానున్న రోజుల్లో వేల మంది ఉద్యోగులు రిటైర్ కాబోతున్నారని, వాళ్ల పరిస్థితి ఏమవుతుందో అనే భయం అందరిలో ఉందన్నారు. ఉన్న హెల్త్ స్కీమ్ అమలు కావడం లేదని, నూతన హెల్త్ స్కీమ్‌ను అమలుచేసే పరిస్థితి ఉందా? అని ఆయన ప్రశ్నించారు.

ఓవైపు రైతు రుణమాఫీకి నిధులు లేవంటారు.. రైతు భరోసా నిధులు రాకపోవడంతో రైతులు పంట పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నారని, రైతు భరోసా రబీ సీజన్ పూర్తయినా ఇవ్వలేదని, రుణమాఫీ ఎంతమందికి ఇచ్చారో వివరాలు బయటపెట్టాలన్నారు. హిల్ట్ పాలసీ పేరుతో వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. 

సమరమే!: ఈటల రాజేందర్

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకుంటే సమరానికి సిద్ధమవుతామని ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వానికి హెచ్చరించారు. 35 సంవత్సరాలు సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు రాకపోవడంతో, ఆత్మహత్య లు చేసుకునే పరిస్థితి తలెత్తిందని, ఇది తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ చూడని బాధాకర పరిస్థితి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట లు బ్రహ్మాండంగా ఉన్నాయి.. కానీ చేతలు లేవన్నారు.

మాజీ మంత్రులుగా తాము చీఫ్ సెక్రటరీలకు, ఫైనాన్స్ సెక్రటరీలకు అనేకసార్లు పెన్షనర్ల సమస్య గురించి మెసేజ్‌లు పెట్టాం, ఫోన్లు చేశామని, కానీ వారి నుంచి సమాధానం ఒక్కటే.. మా చేతిలో ఏమీ లేదంటున్నా రని చెప్పారు. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ కాలంలో ఇదే ధర్నా చౌక్‌లో పడుకుని అలిసిపోయామని, ‘అప్పుడు అనుకు న్నాం.. తెలంగాణ కోసం కదా అని’.. కానీ అం త కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి కన్నీళ్లు చూస్తామని ఎవరు ఊహించలేదన్నారు.

రిటైర్డ్ ఉద్యోగులు సచివాల యం గేట్లు ఎక్కి ఉద్యమాలు చేయకపోవ చ్చు.. కానీ వాళ్ల దగ్గర ఒక ఆయుధం ఉంది.. లక్షల మందిని కదిలించే ఆయుధం.. దాని తో ఈ ప్రభుత్వ భరతం పట్టడం ఖాయమన్నారు. తాను మాజీ ఆర్థికమంత్రిగా 2018 19లోనే చెప్పాను.. రాష్ట్రానికి అదనంగా ఖర్చు చేసే స్థోమత లేదు అని.. అయినా నిరుద్యోగ భృ తి, రుణమాఫీ వంటి అమలు చేయలేని హామీలు ఇచ్చారని తెలిపారు.

నిరుద్యోగ భృతి, ఏకకాలంలో రుణమాఫీ కాలేదని, జీతాలు, పెన్షన్లు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి తలెత్తిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూములు బ్రోకర్లు, భూబకాసులకు కట్టబెట్టబడుతోందని, తెలంగాణ సమాజం మౌనంగా ఉండొ చ్చు కానీ, అది బలహీనత కాదని, సమయం వచ్చినప్పుడు బరిగీసి కొట్టే శక్తి తెలంగాణ ప్రజలకు ఉందన్నారు. 

మాయమాటలు చెప్పి: ఎంపీ డీకే అరుణ

గత ప్రభుత్వాన్ని గద్దె దించి.. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఎంపీ డీకే అరుణ తెలిపారు. ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిందన్నారు. అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెప్పి ప్రజలను వంచించి, మోసగించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వెంటనే డీఏలు, పీఆర్సీలు ఎప్పటికప్పుడు ఇస్తామని హామీ ఇచ్చారని, అన్ని రకాలుగా ఉద్యోగులకు ఫ్రెండ్లీగా ఉంటామని మాట చెప్పారన్నారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన ఇప్పటికి డీఏలు, పీఆర్సీలు లేవన్నారు. పదవి విరమణ చేసేనాటికి పెద్ద మొత్తంలో డబ్బు రావాలని, ఉద్యోగులు నెలనెల దాచుకున్న డబ్బు కూడా చెల్లించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. పదవి విరమణ పొందిన కుటుంబాలలో ప్రశాంతత లేకుం డా చేశారని, దాదాపు 70 మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూసి ప్రాణాలు కోల్పోయారన్నారు.

వాళ్ళు క్లియర్ చేయాలనుకు బిల్లు మాత్రమే క్లియర్ చేస్తున్నారని, పర్సంటేజ్‌లు తీసుకొని బిల్లులు చెల్లిస్తున్నారని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇస్తే.. పర్సంటేజ్ రాదు కాబట్టి ఇవ్వడం లేదని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్ అని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని రోజుకో ప్రకటన చేస్తున్నారని, ప్రస్తుతం ఉన్న ఒక్కో స్కూల్స్ కి కోటి రూపాయలు ఇస్తే.. బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుందని, పబ్లిక్ స్కూల్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇవన్నీ కాగితాలకే పరిమితం తప్ప.. పూర్తి చేయడం ఉండదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంటే 24 గంటలలో రిటైర్ ఉద్యోగుల బకాయిలు చెల్లించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సుమా రు 3.6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 2.8 లక్షల రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారని, మొత్తం 6.4 లక్షల మందికి సంబంధించిన ఎరియర్స్ సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నా యన్నారు.

గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పీఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఆరు డీఏలు ఇప్పటికీ చెల్లించని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మాయమాటలు చెప్పి, మోసం చేసి కాంగ్రెస్ అధి కారంలోకి వచ్చిందని, మోసం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి లక్షణమన్నారు. ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడుతూ.. ప్రభు త్వం ప్రతినెలా బాండ్స్‌లను పెట్టి ఆర్‌బీఐ నుంచి డబ్బులు తీసుకొచ్చి వాటి నుంచి పెన్షనర్లకు కొంత కేటాయించాలని కోరారు.

బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, విద్యాకమిషన్ తన వ్యక్తిగత అభిప్రాయాలను నివేదికలో రుద్దిందని, దాన్ని చెత్త బుట్టలో వేయాలన్నారు. ఎమ్మె ల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ చేతి లో పట్టుకొని తిరిగే రాజ్యాంగం అందరికీ ఒక్కటే అయినప్పుడు పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలు మరి ఎందుకివ్వడంలేదని, ప్రతి నెలా వెయ్యి మంది వరకు ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారన్నారు. 

40 శాతం కమీషన్ల ప్రభుత్వం

రూ. 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెం ట్ బకాయిలున్నాయని, ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల వద్దే ఫీజులు వసూలు చేస్తున్నాయని, ఫలితంగా చదువును మధ్యలో వదిలేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. గురు కులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలతో ఆసు పత్రుల పాలైనా ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని, రేవంత్ ప్రభుత్వం 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారిందని, అక్రమ వసూళ్లు, భూదోపిడీ, ప్రభుత్వ భూముల అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

పెన్షనర్ల ఓటుబ్యాంక్ తక్కువ అని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా వేధిస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో విశ్వవిద్యాలయాల పరిస్థితి రోజురోజుకీ దారుణంగా తయారవుతోందని, ఒక్క కొత్త ప్రొఫెసర్ పోస్టును కూడా భర్తీచేయని ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, అధ్యాపకులు లేరు, విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లేదు. ఇదేనా కాంగ్రెస్ చెప్పే పరిపాలన? అంటూ నిలదీశారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల పరిస్థితిని సరిదిద్దాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు.

స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను వెంటనే ప్రక్షాళన చేయాలని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడటం సరికాదని, ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌లు కోర్టు కేసులను ఎదుర్కోవలసి వస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేవని, తెలంగాణ మొత్తాన్ని అంధకారంగా మార్చారని, ఈ కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. ప్రభుత్వం మారి తే, పరిస్థితి మారుతుందని భావిం చామని.. కానీ బీఆర్‌ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఉద్యోగుల, ఉపాధ్యాయుల, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పెరిగాయన్నారు.