సీట్లు నిండు తలేవ్!
- ప్రొఫెషనల్ కోర్సులపై తగ్గుతున్న ఆసక్తి
- 2.79 లక్షల సీట్లలో 1.16 లక్షల సీట్లు ఖాళీనే
- ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్, ఎంటెక్, ఎంఫార్మసీ, లా తదితర కోర్సుల్లో భారీగా మిగులుతున్న సీట్లు
హైదరాబాద్, మే 9 (విజయక్రాంతి): ఎక్కడైనా..ఏ కోర్సులోనైనా తమ పిల్లలకు సీటు దొరుకుతుందో లేదోనన్న ఆందోళన తల్లిదండ్రుల్లో ఉంటుంది. కానీ మన దగ్గర మాత్రం సీట్లు పుష్కలంగా మిగులుతున్నాయి. ఉన్న సీట్లు కూడా సరిగా నిండుతలేవు.
ఇది కేవలం ఏ ఒక్క కోర్సులోనో కాదు... ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంఏ, ఇంజినీరింగ్ నుంచి మొదలుపెడితే ఫార్మసీ, అగ్రికల్చర్, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఎడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంటెక్, ఎంఫార్మసీ తదితర అన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ సీట్లు నిండడం గగనమవుతోంది.
సీపీగెట్, ఎడ్‌సెట్, పీఈసెట్‌లోనైతే కనీసం 50 శాతం సీట్లు నిండ డం కూడా కష్టమే అవుతోంది. అదే మొత్తం గా చూసుకుంటే 60 శాతం నుంచి 70 శాతం కూడా సీట్లు నిండడంలేదు. దీంతో కాలేజీలు మూతపడే స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది.
1,16,759 సీట్లు మిగులు..
రాష్ట్రంలో ఈ ఏడు కోర్సులు అందించే కాలేజీలు మొత్తం 1518 కాలేజీలుండగా, వీటిలో 2025- 26 విద్యాసంవత్సరానికి 2,79,238 సీట్లు ఉన్నాయి. అయితే ఈ మొ త్తం సీట్లలో 1,62,479 (58.18 శాతం) సీట్లు మాత్రమే నిండగా, ఇంకా 1,16,759 సీట్లు నిండనేలేదు. అంటే ఇంకా దాదాపు 42 శాతం సీట్లు మిగిలిపోయాయి. కోర్సుల వారీగా.. ఇం దులో ఎప్‌సెట్ కోర్సులు అందించే కాలేజీలు 386 ఉండగా, వీటిలో 1,41,434 సీట్ల కు గానూ 88,560 సీట్లు మాత్రమే నిండా యి.
ఐసెట్ కోర్సులు అందించే 367 కాలేజీల్లో 49,961 సీట్లలో 31,581 సీట్లు నిం డగా, పీజీ కోర్సులు అందించే 247 కాలేజీల్లో 44,847 సీట్లలో కేవలం 19,649 మాత్రమే నిండాయి. ఆఖరికీ లాసెట్ కోర్సులోనూ 10, 050 సీట్లలో 6639 సీట్లు మాత్రమే నిండాయి.
ఇలా మిగతా బీఎడ్, ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మ్‌డీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కో ర్సుల్లోనూ 2025-26 విద్యాసంవ త్సరంలో కనీసం 60 శాతం సీట్లు సైతం నిండని దుస్థితి. చెప్పాలంటే ఇవ న్నీ కన్వీనర్ కోటా సీట్లే.. డబ్బులు పెట్టి కొనుగోలు చేయడానికి మేనేజ్‌మెంట్ కోటా సీట్లు కూడా కాదు. కొంత మంది విద్యార్థు లు మధ్యలోనే చదువును మానేసి డ్రాపౌట్ అవుతుంటే, మరికొంత మంది ఇతర ఉపా ధి మార్గాలను, పైచదువులకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు.
కాలేజీలపై ప్రభావం..
ఒకవైపు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయడంలే దు. ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. ఇవి ఎప్పుడు విడుదల చేస్తారో తెలియనిపరిస్థితి. మరోవైపు నూతన విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వం ఫీజులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయనుంది. ఈక్ర మంలో ఫీజులు కడితెనే విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఫీజులు కట్టకుంటే ఆయా కాలేజీలు సీట్లను కేటాయించరు.
అసలు ప్రభుత్వం ఎన్ని విడతల్లో ఫీజును చెల్లిస్తుందనేది స్పష్టత లేదు. ఈక్రమంలో పాత బకాయిలు రాక, కొత్త విద్యాసంవత్సరంలో రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టతలేక అడ్మిషన్లపై ప్రభావం పడుతుందని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీట్లు నిండక, ఫీజు బకాయిలు విడుదల కాకపోవడవంతో ఇప్పటికే నిర్వహణ భారంగా మారిన కాలేజీలు మూతపడే దశకు చేరుకుంటున్నాయని ఓ కళాశాల మేనేజ్‌మెంట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలానే ఉంటే భవిష్యత్తులో చాలా మంది ప్రైవేట్ విద్యారంగం నుంచి తప్పుకుంటారని పేర్కొన్నారు.






