10 July, 2026 | 4:14 AM

కోదాడ ప్రగతిని జీర్ణించుకోలేకే ఆరోపణలు!

09-07-2026 05:31 PM

మాజీ ఎమ్మెల్యే బొల్లం అసత్య ఆరోపణలు మానుకోవాలి

ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమ కారుట సంక్షేమ సంఘం, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపూడి వెంకటనారాయణ

కోదాడ జూలై 09,(విజయక్రాంతి): కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy), ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధారరహిత ఆరోపణలు చేస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమ కారుట సంక్షేమ సంఘం, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయపూడి వెంకటనారాయణ విమర్శించారు.

గురువారం ఆయన  మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అసత్య ఆరోపణలు మానుకుని ప్రజా సమస్యలపై మాట్లాడాలని హితవు పలికారు. గత 30 నెలల్లో కోదాడ నియోజకవర్గానికి వివిధ శాఖల ద్వారా రూ.1,938.41 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ పనులు మంజూరయ్యాయని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులు, కాలువల ఆధునీకరణకు రూ.181.50 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, వంతెనలు, భవనాల నిర్మాణానికి రూ.292.67 కోట్లు, పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధికి రూ.239.86 కోట్లు, ప్రజారోగ్యం, మున్సిపల్ మౌలిక సదుపాయాలకు రూ.360.47 కోట్లు, విద్యా రంగానికి రూ.253 కోట్లు కేటాయించి కోదాడ అభివృద్ధికి బలమైన పునాది వేశారని పేర్కొన్నారు.

ఇందిరమ్మ గృహ పథకం కింద 1,031 ఇళ్ల నిర్మాణానికి రూ.51.50 కోట్లు మంజూరయ్యాయని, రైతు సంక్షేమంలో భాగంగా 31,461 మంది రైతులకు రూ.211.17 కోట్ల రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతు బీమా పథకాలను సమర్థవంతంగా అమలు చేశారని చెప్పారు. అలాగే జవహర్ నవోదయ పాఠశాల, యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధితో పాటు కోదాడలో 100 పడకల ఆసుపత్రి, సబ్‌సెంటర్ భవనాలు, సీటీ స్కాన్ మిషన్ ఏర్పాటు ద్వారా వైద్య సేవలు మెరుగుపడ్డాయని వివరించారు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలు రాష్ట్రంలో అభివృద్ధిలో ముందంజలో నిలుస్తుంటే దానిని జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాయపూడి వెంకటనారాయణ ఆరోపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి నాయకత్వంలో కోదాడ అభివృద్ధి ఇదే వేగంతో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.