ఉద్యోగులు సమయపాలన పాటించాలి
కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి, జూలై 9: ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం బెల్లంపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు పట్టికలు, కార్యాలయ రికార్డులు, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వివరాల నమోదు అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని, ఈ నెల 24లోగా ప్రక్రియ పూర్తి చేసే విధంగా పనులు వేగవంతం చేయాలని కోరారు. వివిధ ధ్రువపత్రాల కోసం అందిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులుగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి భూభారతి పెండింగ్ వివరాలను పరిశీలించారు. అనంతరం నెన్నెల మండలం ఆవడంలోని జడ్పీహెచ్‌ఎస్ ను తహసిల్దార్ శ్రీనివాస్ తో కలిసి సందర్శించి తరగతి గదులు, మధ్యాహ్న భోజనం పథకం అమలు, సైన్స్ వేర్ నిర్వహణ, రిజిస్టర్లను పరిశీలించారు.
మంచిర్యాల జిల్లా విద్యారంగంలో దేశంలో, రాష్ట్రంలో ఉన్నత స్థానాలలో నిలిచిందని, ఈ ఏడాది జిల్లాలో దాదాపు 320 మంది ఉపాధ్యాయులను నియమించామని, అడ్మిషన్లలోనూ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. హరే రామ హరే కృష్ణ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన విద్యతో అడ్మిషన్లు పెరుగుతున్నాయన్నారు.






