ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన
టిజిఈజెఎసి జిల్లా చైర్మన్ అహ్మద్ ఒమర్ ఉసేన్
కుమ్రంభీంఆసిఫాబాద్, (విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (TGEJAC) ఆధ్వర్యంలో ఉద్యోగుల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. TGEJAC రాష్ట్ర కమిటీ ఏప్రిల్ 7న నిర్వహించిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో తీసుకున్న తీర్మానం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 33 జిల్లాలు, సెక్రటేరియట్, హెచ్‌ఓడీ కార్యాలయాలు, మండల , డివిజన్ కార్యాలయాలలో సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన నాలుగు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. రెండవ పీఆర్‌సీ నివేదికను వెంటనే విడుదల చేసి 51 శాతం ఫిట్‌మెంట్‌తో జూన్ 2లోపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.13 వేల కోట్ల బిల్లులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి రిటైర్ అయిన ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య కార్డుల అమలులో ఉన్న ఆలస్యాన్ని తొలగించి కొత్త ఈహెచ్‌ఎస్ విధానంతో మే నెల నుంచి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ను పునరుద్ధరించాలని, ముఖ్యంగా 2004 సెప్టెంబర్ 1కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు వెంటనే ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మరిన్ని 64 పెండింగ్ అంశాలను కూడా ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని కోరింది.ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.






