మానవ విలువలతో సాంకేతిక విద్య అవసరం
కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ డా నీలా సత్యనారాయణ
కోదాడ మే 3, మానవ విలువలతో కూడిన విద్యతో పాటు ఆధునిక సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని భవిష్యత్తును తీర్చిదిద్దే ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని కళాశాల చైర్మన్ డాక్టర్ నీలా సత్యనారాయణ సూచించారు. కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి ఇంజనీరింగ్ పట్టభద్రులుగా ఎదగడం గర్వకారణమని, ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చాలని విద్యార్థినులకు ప్రేరణనిచ్చారు.
గ్రామీణ స్థాయిలోనే నాణ్యమైన సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో కళాశాలను స్థాపించినట్లు వివరించారు. అనంతరం పట్టభద్రులకు స్నాతకోత్సవ పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్లపల్లి గాంధీ, అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాగార్జునరావు, విభాగాధిపతులు రమేష్, నరేష్ రెడ్డి, స్రవంతి, శివాజీ, లక్ష్మణ్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.






